భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై పనౌటీ మోడీ అంటూ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి ఎన్నికల సంఘం షాక్ ఇచ్చింది. రాహుల్ గాంధీకి షోకాజ్ నోటీసు జారీ చేసింది ఈసీ. పనౌటీ పద ప్రయోగం ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు, జేబుదొంగ అంటూ ప్రకటనలు చేసినందుకు సమాధానం కోరింది ఈసీ. నవంబర్ 25 సాయంత్రం 6గంటలలోపు సమాధానం ఇవ్వాలని సూచించింది.
నవంబర్ 22వ తేదీన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బీజేపీ ఎన్నికల కమిషన్‌లో ఫిర్యాదు చేసింది. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్‌పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేసింది. భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి రాధా మోహన్ దాస్ అగర్వాల్, మరో నేత ఓం పాఠక్ సహా ప్రతినిధి బృందం రాహుల్ గాంధీ ప్రకటనను అవమానకరమైనదిగా పేర్కొంటూ ఈసీని ఆశ్రయించారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీల వ్యాఖ్యలు అసత్యాలను వ్యాప్తి చేస్తున్నాయని, వారి ప్రవర్తన నైతిక ప్రమాణాలను ఉల్లంఘిస్తున్నందున వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీజేపీ నేతలు.