వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కు కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించినందుకు.. మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదని వివరణ ఇవ్వాలని ఆదేశించింది. నిన్న యూపీ ఎన్నికలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలో యోగీ ఆదిత్య నాథ్కు ఓటేయకుంటే.. బుల్డోజర్, జేసీబీలతో తొక్కిస్తామని హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి.
యూపీలో యోగీ బాబా హవా నడుస్తుందని.. యోగీకి ఓటేయని వారు యూపీ నుంచి పారిపోవాలని హెచ్చరించారు. ఓటేయని వారి ఏరియాలను గుర్తించామని.. వారి కోసం జేసీబీలు, బుల్డోజర్లు తీసుకువస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ వ్యాఖ్యలపై పొలిటికల్ దుమారం రేగింది. ఈ రోజు మంత్రి కేటీఆర్ బీజేపీకి జోకర్ దొరికాడంటూ… రాజాసింగ్ గురించి ట్విట్లర్లో వ్యాఖ్యానించాడు. దీనికి ప్రతిగా రాజాసింగ్ స్పందిస్తూ.. తెలంగాణలో జోకర్లు ఎవరో తెలంగాణ ప్రజలకు తెలుసంటూ.. కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు. అయితే తాను దేశ ద్రోహులను గురించి ఈ వ్యాఖ్యలు చేశానని ఈరోజు వివరణ ఇచ్చాడు రాజాసింగ్.