దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అధికారులు మూడో రోజు పది గంటల పాటు విచారించారు. ఉదయం 11.30 గంటలకు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన ఆమె.. రాత్రి 9.30 గంటలకు పిడికిలి బిగించి అభివాదం చేస్తూ, విజయచిహ్నం చూపుతూ బయటికొచ్చారు. మూడు రోజుల్లో విచారణ 29 గంటల పాటు ఈడీ అధికారులు కవితను విచారించారు. అయితే తదుపరి విచారణ ఎప్పుడనేది మాత్రం వారు చెప్పలేదు. ఆ విషయం తర్వాత చెబుతామని ఈడీ అధికారులు అన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి.
ఇక కవితను ఇతరర నిందితులతో కలిపి విచారించారా? అన్న దానిపై స్పష్టత లేదు.మంగళవారం రాత్రి 7.45 గంటల సమయంలో బీఆర్ఎస్ లీగల్ విభాగం ప్రధాన కార్యదర్శి సోమభరత్ ఈడీ కార్యాలయంలోకి వెళ్లారు. మూడు రోజుల విచారణలో భాగంగా.. కవిత ఇచ్చిన వాంగ్మూలాలపై సంతకాలు చేయించుకొనే క్రమంలో ఆథరైజేషన్ కోసం న్యాయవాది అయిన సోమభరత్‌ను పిలిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు ఈడీ సమన్లను సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన రిట్ పిటిషన్ శుక్రవారం నాడు సుప్రీంకోర్టు ముందు విచారణకు రానుంది.