TSPSC పేపర్ లీక్ కేసులో నేటి నుంచి ఈడీ విచారణ షురూ

-

TSPSC పేపర్ లీకే కేసులో ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. ఈ వ్యవహారంలో ఇవాళ్టి నుంచి విచారణ జరపనుంది. ఇందులో భాగంగానే.. కమిషన్‌లో పరీక్షల వ్యవహారాలను పర్యవేక్షించే కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఇన్‌ఛార్జి శంకరలక్ష్మి, లీకేజీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి(ఏఎస్‌వో) సత్యనారాయణలకు ఈడీ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. బుధ, గురువారాల్లో తమ ఎదుట విచారణకు హాజరు కావాలని వాటిలో పేర్కొన్నారు.

జ్యుడిషియల్‌ రిమాండులో ఉన్న ప్రధాన నిందితులు ప్రవీణ్‌, రాజశేఖర్‌ల వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ సోమవారం నాంపల్లిలోని ఈడీ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. మరోవైపు, ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో సిట్‌ అధికారులు తమకు సహకరించని పక్షంలో అవసరమైతే న్యాయస్థానం ద్వారా అయినా వివరాలు తీసుకోవాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీలో పెద్దమొత్తంలో నిధుల మళ్లింపు జరిగిందన్న ఆనుమానంతో ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. దీని ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టారు. పోలీసులు ఇప్పటివరకూ రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం కనీసం రూ.40 లక్షలు చేతులు మారి ఉండవచ్చని సిట్‌ భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news