వ్యాపారి ఇంట్లో ఈడీ సోదాలు.. బయటపడ్డ నోట్ల గుట్టలు

-

పశ్చిమ బెంగాల్ లో ఓ వ్యాపారి ఇంట్లో జరిగిన ఈడీ సోదాల్లో.. భారీగా నోట్ల గుట్టలు బయటపడ్డాయి. ఈ తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.7 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. మోసపూరిత మొబైల్‌ గేమింగ్‌ యాప్‌ ప్రమోటర్లపై నమోదైన మనీలాండరింగ్‌ కేసులో దాడులు జరిపినట్లు వెల్లడించారు.

బంగాల్‌కు చెందిన ‘ఇ-నగెట్స్‌’ అనే గేమింగ్‌ యాప్‌ మోసాలకు పాల్పడుతూ యూజర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో 2021లో ఈ కంపెనీ, ప్రమోటర్లపై కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా ఈడీ మనీలాండరింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే కంపెనీ ప్రమోటర్‌ ఆమిర్‌ ఖాన్‌ నివాసంతో పాటు 6 చోట్ల శనివారం సోదాలు చేపట్టింది.

ఈ తనిఖీల సమయంలో అతని ఇంట్లో లెక్కల్లోకి రాని భారీ మొత్తంలో నగదు బయటపడింది. దీంతో అధికారులు లెక్కింపు మొదలుపెట్టగా.. ఇప్పటివరకు రూ.7కోట్లుగా తేలింది. ప్రస్తుతం లెక్కింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. నగదుతో పాటు కొన్ని ఆస్తి పత్రాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సోదాలపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ యాప్‌కు.. చైనా నియంత్రణలో నడుస్తోన్న రుణ యాప్‌లతో సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఈడీ వెల్లడించింది. ఈ యాప్‌ను ఆమిర్‌ కుమారుడు నజీర్‌ అహ్మద్‌ ఖాన్‌  ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news