ప్రధాన మంత్రి మోదీ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్వహిస్తున్న కేంద్ర-రాష్ట్ర సైన్స్ సదస్సును ప్రారంభించారు. దేశంలో ఉన్నత ప్రమాణాలతో కూడిన శాస్త్ర (సైన్స్), సాంకేతిక (టెక్నాలజీ), సృజనాత్మక (ఇన్నోవేషన్) వ్యవస్థను నిర్మించడంలో కేంద్ర-రాష్ట్రాల పరస్పర సమన్వయం, సహకార యంత్రాంగాన్ని బలోపేతం చేయడం కోసం రెండు రోజుల పాటు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు ప్రముఖ పారిశ్రామికవేత్తలు, యువ శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.
కేంద్రం నిర్వహించే కార్యక్రమాలకు రాష్ట్ర ప్రభుత్వాలు దూరంగా ఉండటం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ కేంద్ర-రాష్ట్ర సైన్స్ సదస్సును ప్రారంభించగా.. ఝార్ఖండ్, బిహార్ హాజరుకాలేదు. దీంతో ఆ రాష్ట్రాలపై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తోంది. గైర్హాజరీపై ఆయా రాష్ట్రాల నుంచి అధికారికంగా ఎలాంటి స్పందన రాలేదు. ‘‘ఆ రెండు రాష్ట్రాలకు సైన్స్, ఇన్నోవేషన్ అంత ప్రాధాన్యం కాదేమో’’ అంటూ బీజేపీ వర్గాలు వ్యంగ్యాస్త్రాలు గుప్పిస్తున్నారు.