ప్రపంచం ఒక్కసారే నివ్వెరపోతుంది
కాలం ఒక్కసారే గెలుపు కానుక ఇచ్చి వెళ్తుంది
అనూహ్య రీతికి దగ్గరగా విజయాలు ఉంటే
ఆ వ్యక్తులు చిరస్మరణీయ స్థాయి అందుకుంటారు
అందుకు ట్రిపుల్ ఆర్ తార్కాణం కావొచ్చు
బాహుబలి అయింది
రేపటి వేళ మరో విజువల్ వండర్..రావొచ్చు..
అందులో కూడా ఒక్క మనిషి కష్టం సంబంధిత విలువ
కోట్ల రూపాయలకు అందనిదిగా ఉంటుంది
ఆ వ్యక్తి కీర్తి శిఖరాలు దాటి వెళ్తుంది..భవిష్యత్ ఇదే!
ఆ సినిమా మనిషి పేరు రాజమౌళి..సెల్యూట్ రాజమౌళి
సినిమాలు చేసి,చేసి రాజమౌళి పెద్దవాడు అయ్యారు. ఈ మాట చెప్పడం ఎంత సులువు. డైరెక్షన్ ఒక్కటే కాదు చాలా పనులు సెట్లో ఒంటరిగా చేసుకుని ఒడ్డుకు రావడం ఆయనకు మాత్రమే తెలుసు. రైటింగ్ స్కిల్స్ పెద్దగా లేకపోయినా కూడా ఒక సీన్ ను ఎన్ని విధాలుగా మలచవచ్చో తెలిసిన మంచి దర్శకుడు. అప్పటిదాకా ఆయన వేరు..మగధీరతో ఆయన స్థాయి వేరు. ఆ విధంగా ఆ సినిమా మంచి డబ్బులు తెచ్చి పెట్టింది. పేరు కూడా తెచ్చి పెట్టింది. ఓ సినిమాకు ఇంత ఖర్చు చేయవచ్చా అని బాహుబలి లాంటి సినిమాలకు ప్రేరణ అయింది. వాస్తవానికి ఆ కథలో కొత్తేం లేకపోయినా ఆ సినిమా హిట్. మెగా పవర్ స్టార్ చరణ్ హిట్ .. అందాల కాజల్ హిట్.. స్వరవాణి కీరవాణి హిట్ .. ఆ విధంగా చరణ్ కెరియర్ మారిపోయింది. అంతకుమునుపు సింహాద్రిలాంటి కమర్షియల్ హిట్ తో తారక్ కెరియర్ ఊహించనంత ఎత్తుకు ఎదిగిపోయింది. దాంతో ఆ పేరు..ఆ కీర్తి..ఆయన మోయలేకపోయారు.
అటుపై బాహుబలితో ప్రభాస్ స్థాయి పెరిగింది. అనూహ్యం అనుకునే స్థాయిలో రానా కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ ఇద్దరితో పాటు రాజమాత శివగామి పాత్రలో రమ్యకృష్ణ తన నటనకు ఎదురేలేదని నిరూపించుకున్నారు. దేవసేన పాత్రలో అనుష్క, అవంతిక పాత్రలో ఆన్ స్క్రీన్ రొమాన్స్ పండించడంలో తమన్ మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే ఓ సామాన్య రీతిలో ఉండే సినిమా స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది అని చెప్పేందుకు బాహుబలి ఓ మంచి ఉదాహరణ. చాలా మందికి రిఫరెన్స్ కోడ్ కూడా ! బిజినెస్ స్కూల్స్ లో ఇవాళ అదొక పాఠం కూడా ! ఇప్పుడు ట్రిపుల్ ఆర్. ఐదు వందల కోట్లు ఒక్క సినిమాకే.,. రావాల్సింది మూడు వేల కోట్లు.. ఇదీ ఇవాళ రాజమౌళి స్టామినా అంతకుముందు…
చెన్నయ్ దారుల్లో రాజమౌళి.
జేబులో డబ్బులే లేవు. అన్నయ్య కీరవాణిని పోయి అడగలేరు. అడగాలనుకున్నా ఆత్మవిశ్వాసం ఒకటి అడ్డు. ఇంట్లో అంతా ఆయనను నంది అని పిలుస్తారు. కష్టాల్లో ఉన్న కుటుంబంలో ఆయనే చిన్నవాడు. ఓ రోజు తనకు నచ్చిన విధంగా బతకాలని అనుకుంటూ,అనుకుంటూ తన కుటుంబానికి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఆ విధంగా రాఘవేంద్రరావు ఆ విధంగా ఇంకొందరు ఆయనకో దారి చూపారు. ఓ సీరియల్ కు ఎపిసోడ్ డైరెక్టర్ రాజమౌళి. ఈ విధంగా ఈ రోజు ఆయన గురించి చెబితే అంతా నవ్వుతారు. నమ్మరు..కొందరు..ఈ మాటలు అన్నీ అబద్ధం అని కొట్టిపడేస్తారు. కానీ చాలా చిన్న పని చేసినా కూడా పర్ఫెక్షనిజం పోకూడదన్నది రాజమౌళి నమ్మిన సిద్ధాంతం. అదే ఆయన విజయాలకు ప్రధాన సూత్రం.
ప్రాథమిక సూత్రం కూడా ఇదే ! సెల్యూట్ రాజమౌళి..అనండిక వందో సారి మరియు వెయ్యో సారి….
– రత్నకిశోర్ శంభుమహంతి శ్రీకాకుళం దారుల నుంచి….