దేశంలో రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. గోవాలో మాత్రం పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. పర్యాటకులకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గోవాలో కరోనా కేసుల సంఖ్య అధికంగా ఉంటాయని అంతా భావిస్తారు. కానీ అక్కడ ఇప్పటివరకు ఏడు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. అందరు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో గోవాలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య జీరోకు చేరింది.
అయితే గోవాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో మాత్రం ఓ వైద్యుడు కీలక పాత్ర పోషించారు. ఆయనే డాక్టర్ ఎడ్విన్ గోమ్స్. గోవాలోని కోవిడ్ ఆస్పత్రికి నోడల్ ఇంచార్జ్‌గా ఉన్న ఎడ్విన్ నేతృత్వంలోని వైద్య బృందం నిరాంతరాయంగా శ్రమించి కరోనా బాధితులకు చికిత్స అందించారు. ఒకరు కూడా ప్రాణాలు కోల్పోకుండా చూశారు.ఈ సందర్భంగా ఎడ్విన్‌ను ప్రశంసిస్తూ.. గోవా ఆరోగ్య శాఖ మంత్రి విశ్వజిత్ రాణె ఓ ట్వీట్ చేశారు. ‘కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు మా వైద్య బృందం ఈఎస్ఐ ఆస్పత్రిలో విరామం లేకుండా పనిచేస్తున్నారు. డాక్టర్ ఎడ్విన్ నేతృత్వంలో వైద్య బృందానికి అభినందనలు’ అని తెలిపారు.
కాగా, గోవాలో ఉన్న ఏకైక మెడికల్ కాలేజ్ అయిన గోవా మెడికల్ కాలేజ్ మెడిసన్ డిపార్ట్‌మెంట్ హెడ్‌గా ఎడ్విన్ విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా బాధితులకు సరైన చికిత్స అందించేలా 200 మంది వైద్యులను సరైన మార్గనిర్దేశనం చేయడంలో ఆయన కీలక భూమిక పోషించారు. అయితే 2011లో ఎంబీబీఎస్ మూడో సంవత్సరం పరీక్ష పత్రాలు లీక్ చేశారని ఎడ్విన్‌పై ఆరోపణలు వచ్చాయి. అప్పుడు 48 మంది విద్యార్థులు ఇందులో ఎడ్విన్ పాత్ర లేదని తెలుపడంతో ఈ కేసుకు సంబంధించి ఆయనకు క్లీన్ చిట్ లభించింది.
అయితే కరోనా కేసులు ప్రారంభమైన సమయంలో గోవాలో కనీస వైద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం కొద్దిపాటి కలవరానికి గురిచేసింది. కానీ గోవా ప్రభుత్వం, వైద్య సిబ్బంది దానిని అధిగమించి కరోనా కట్టడిలో విజయం దిశగా అడుగులు వేశారు.