సీఎం కేసీఆర్ ఎక్కడ ఉపన్యాసం ఇచ్చినా అబద్ధాలు తప్ప నిజాలు ఉండవని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గెస్ట్ లెక్చరర్స్ హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ విద్యలో పనిచేస్తున్న తమని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నాంపల్లిలోని ఇంటర్ కమిషనర్ కార్యాలయాన్ని అతిథి అధ్యాపకుల ఐకాస ముట్టడించింది. రాష్ట్రంలోని 405 ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కొత్త నోటిఫికేషన్ విడుదల చేయడాన్ని ఆక్షేపించారు. నిరసన చేస్తున్న అతిథి అధ్యాపకులను అరెస్టు చేసిన పోలీసులు ముషీరాబాద్ స్టేషన్‌కు తరలించారు.
అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఏలుబడిలో ప్రశ్నిస్తే సహించడని మండిపడ్డారు. సమ్మెలకు, సంఘాలకు ఆస్కారం లేదన్నట్టుగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని ఈటల ఫైరయ్యారు. ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు పెండింగ్‌లో ఉన్నాయని, వీఆర్ఏలు సమ్మె చేస్తే బెదిరింపులకు దిగారని ధ్వజమెత్తారు. వీఆర్వోలను ముంచి.. ఎక్కడెక్కడో వేశారని, పంచాయతీ సెక్రటరీలను బెదిరించి పని చేయించుకుంటున్నారని విమర్శలు చేశారు. ఏపీలో మహిళా సంఘాలకు రూ.10 వేల గౌరవ వేతనం ఇస్తున్నారని, తెలంగాణలో మూడు వేలు మాత్రమే ఇస్తున్నారని ఈటల ఆగ్రహం వ్యక్తంచేశారు.