తెలంగాణలోని తమ నేతల భద్రత విషయంలో బీజేపీ అధిష్టానం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇద్దరు బీజేపీ నేతలకు కేంద్రం భద్రత కల్పించింది. తెలంగాణలో త్వరలోనే ఎన్నికలు జరుగనున్న క్రమంలో తమ నేతల భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంట్లో భాగంగా హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు సీఆర్‌పీఎఫ్ భద్రత కల్పించింది. దీనికి సంబంధించి కేంద్రం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నుంచి ప్రాణహాని ఉందని, గుర్తు తెలియని వ్యక్తులు తన ఇల్లు, కార్యాలయం పరిసరాల్లో తిరుగుతున్నారంటూ ఈటల రాజేందర్ ఆరోపణలు చేశారు. ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్ 2 భద్రత ఉండేది. వై ప్లస్ భద్రత నేపథ్యంలో ఇకపై మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది విధుల్లో ఉంటారు. ప్రతి షిఫ్ట్‌లో ఇద్దరు చొప్పున పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్(పీఎ్‌సఓ)లు రోజుకు మూడు షిఫ్టుల్లో విధుల్లో ఉంటారు. మరో ఐదుగురు గార్డులు ఈటల ఇల్లు, కార్యాలయం వద్ద భద్రతా విధుల్లో ఉంటారు.