వైఎస్సార్సీపీకి సంబంధించి త్వరలోనే ప్లీనరీ జరుగుతుంది. అది రాష్ట్ర స్థాయి ప్లీనరీ.. ఈలోగా నియోజకవర్గ స్థాయి,జిల్లా స్థాయి ప్లీనరీలతో వైసీపీ కార్యాచరణ అన్నది సాగుతుంది. ఈ క్రమంలో నియోజకవర్గ స్థాయిల్లో జరిగే ప్లీనరీల్లో పలు ఆసక్తిదాయక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా కార్యకర్తలకు తగిన విధంగా విలువ ఇవ్వడం లేదు అని చాలా మంది నాయకులు వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పెండింగ్ బిల్లుల క్లియరెన్స్ కు సీఎం చర్యలు తీసుకోవడం లేదని అంటున్నారు. ఆరోపిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో దర్శి శాసన సభ్యుడు మద్దిశెట్టి వేణుగోపాల్ మాట్లాడుతూ.. తన నియోజకవర్గంలో వంద కోట్ల వ్యయంతో పనులు చేయించానని, కానీ బిల్లులు రాకపోవడంతో కార్యకర్తలు ఇంటి నుంచి బయటకు రాలేకపోతున్నారని ఆవేదన చెందారు. కొందరు కార్యకర్తలు కనిపించకుండా పోతున్నారని వాపోయారు.
ఇటీవల గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఓ కార్యకర్త ఇంటికి వెళ్లగా అక్కడ ఆసక్తిదాయక పరిణామాలు నెలకొని ఉన్నాయని, ప్రభుత్వం పనులు చేసిన ఓ కార్యకర్త బిల్లులు రాకపోవడంతో ఉన్న ఇంటిని కాస్త అమ్ముకుని 25 లక్షల రూపాయల మేరకు బకాయిలు తీర్చారని ఆయన భార్య విలపిస్తూ చెప్పారని సభ లో ఉన్న ఉన్నత స్థాయి నాయకత్వం దృష్టికి తీసుకువచ్చారు. బటన్ నొక్కి డబ్బులు వేయడంతో ముఖ్యమంత్రి గ్రాఫ్ పెరిగిపోతోందని, కానీ ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోతుందని, నాలుగు సీసీ రోడ్లు కూడా వేయలేని స్థితిలో తామున్నామని ఆవేదన చెందారు. గడప లోపల అంతా బాగుంది కానీ బయటే అస్సలు బాలేదని ఆసక్తిదాయక రీతిలో ఆలోచింపజేసేవిధంగా మాట్లాడారు. వచ్చే నెల పదో తారీఖులోగా పెండింగ్ బిల్లులు వస్తాయని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి చెప్పారు.