నకీలీ పేర్లతో ఉన్న ఓటర్ల ఏరివేతను భారత ఎన్నికల సంఘం శరవేగంగా సాగిస్తోంది. దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లను ఏరిపారేశారు అధికారులు. ఒకే పేరు, ఒకే ఫొటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించారు అధికారులు. గడిచిన ఏడు నెలల్లో ఇలా మొత్తం మీద కోటి మంది పేర్లను తొలగించడం లేదా సరిదిద్దడం చేసినట్టు ప్రకటించింది ఎన్నికల కమిషన్. ఓటర్ల సమగ్ర డిజిటల్ జాబితాపై కొంత కాలంగా దృష్టి పెట్టింది ఎన్నికల కమిషన్. ఇందులో భాగంగా నకిలీల ఏరివేతను ప్రాధాన్య అంశంగా తీసుకుని చర్యలు అమలు చేసింది ఎన్నికల కమిషన్. దేశవ్యాప్తంగా ఓటర్లను వారి ఆధార్ తో స్వచ్ఛందంగా అనుసంధానించుకునేందుకు ఎన్నికల
కమిషన్ అనుమతించడం తెలిసిందే. ఈ క్రమంలో 11,91,191 ఓట్లు ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిని పరిశీలించిన తర్వాత 9,27,853 ఓటర్ల పేర్లను తొలగించింది ఎన్నికల కమిషన్. బూత్ స్థాయిలో ధ్రువీకరించుకున్న తర్వాతే జాబితానుంచి పేర్లను తొలగించినట్టు, స్వచ్ఛందంగా తొలగించలేదని తెలిపారు ఎన్నికల కమిషన్ అధికారులు. ఇక ఫొటోలు ఒకే రీతిలో ఉన్న 3,18,89,422 ఓటర్లను గుర్తించగా, తనిఖీ తర్వాత 98,00,412 ఓట్లను తొలగించినట్టు తెలిపింది ఎన్నికల కమిషన్.