తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా తరచూ విద్యుత్ సమస్యలు ఏర్పడుతున్నాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే టీజీఎస్పీడీసీఎల్ సోమవారం స్పందించింది. రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ పోల్స్, విద్యుత్ లైన్స్, కేబుల్స్ సమస్య ఉన్నట్లయితే వెంటనే సమాచారం అందించాలని, అందుకోసం 1912 నెంబర్‌కు కాల్ చేయాలని టీజీఎస్పీడీసీఎల్ వినియోగదారులకు సూచించింది. విద్యుత్ సమస్య ఉన్న ప్రాంతాల్లో తమ సిబ్బంది దాదాపు 36 గంటల నుంచి నిరంతరాయంగా పనిచేస్తున్నారని పేర్కొంది.
విపత్కర సమయాల్లో సిబ్బంది వారి కుటుంబాలకు దూరంగా ఉన్నప్పటికీ ప్రజల భద్రత కోసం పూర్తి అంకితభావం, నిబద్ధతతో సేవలు అందిస్తున్నారని తెలిపింది.రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు చోటుచేసుకోకుండా ప్రజలు అమ్రమత్తంగా ఉండాలని,తడి చేతులతో స్విచ్ బోర్డులను ఆపరేట్ చేయొద్దని సూచించింది. ఏమైన సమస్యలుంటే ప్రజలు 1912 నెంబర్‌కు కాల్ చేయాలని టీజీఎస్పీడీసీఎల్ సంస్థ కోరింది. మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలు అమ్రమత్తంగా ఉండాలని, రోడ్ల మీద ఏమైనా కరెంట్ తీగలు వేలాడుతున్నాయా? అని చూసుకుని ముందుకు సాగాలని సంస్థ సూచనలు చేసింది.