ట్విటర్ మాజీ ఉద్యోగికి సారీ చెప్పిన ఎలాన్ మస్క్

-

మాజీ ఉద్యోగిని ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ క్షమాపణ కోరారు. ఆ సంస్థ నుంచి తొలగించిన మాజీ ఉద్యోగిని ఎగతాళి చేస్తూ అతడి వైకల్యం గురించి ట్వీట్లు చేసిన ఎలాన్‌ మస్క్‌…తన తప్పు తెలుసుకుని ఆ ఉద్యోగిని క్షమించమని అడిగారు. తనకు సమాచారం ఇవ్వకుండా ఉద్యోగం నుంచి తొలగించినందుకు ఐస్‌లాండ్‌కు చెందిన హరాల్డుర్‌ థొర్లెఫ్‌సన్‌ (హల్లి) అనే ట్విటర్‌ ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. 9 రోజులు ఎదురుచూసి చివరకు మస్క్‌ను ట్యాగ్‌ చేస్తూ సోమవారం ట్వీట్‌ చేశారు.

దీనికి ‘మీరు ట్విటర్‌లో ఏం పని చేస్తున్నారు. ఏ విభాగంలో పని చేశారు’ అని మస్క్‌ వరుస ప్రశ్నలు సంధించగా.. హల్లి దానికి సమాధానాలిచ్చారు. మీరు ఏమంత గొప్పగా పని చేయలేదని మస్క్‌ స్పందించారు.

ట్విటర్‌లో ఈ సంభాషణ జరుగుతుండగానే హల్లికి ట్విటర్‌ నుంచి తన లేఆఫ్‌ ఈ-మెయిల్‌ వచ్చింది. మస్క్‌ అక్కడితో ఆగకుండా హల్లికి ఉన్న వైకల్యం గురించి వ్యాఖ్యానిస్తూ.. అతడికి ఉన్న సమస్యను సాకుగా చూపిస్తున్నారని ట్వీట్‌ చేశారు. మస్క్యులర్‌ డిస్ట్రోఫీ అనే వ్యాధితో బాధపడుతున్న హల్లి నిలబడలేరు. చక్రాల కుర్చీలోనే ఉంటూ తన పని చేయాల్సి ఉంటుంది. దీనిని వివరిస్తూ ఆ మాజీ ఉద్యోగి తన వ్యాధి గురించి, దానితో పోరాడుతున్న విధానం గురించి వరుస ట్వీట్లు చేశారు.

అతడి వైకల్యం గురించి అసంబద్ధ వ్యాఖ్యలు చేసిన మస్క్‌ను చట్టప్రకారం శిక్షించాలని యూజర్లు ట్వీట్లతో విరుచుకుపడ్డారు. తన తప్పును గుర్తించిన మస్క్‌.. హల్లిని క్షమాపణ కోరుతూ ట్వీట్‌ చేశారు. ‘అతడికి వీడియో కాల్‌ చేసి మాట్లాడా. ఇలాంటి విషయాల్లో ట్విటర్‌ కన్నా వీడియో కాల్స్‌నే ఆశ్రయించడం మంచిది’ అని చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news