ఏలూరులో వింత రోగం బాధితుల సంఖ్య 350కి చేరింది. ఇప్పటి దాకా 186 మంది డిశ్చార్జి కాగా తొమ్మిది మందిని విజయవాడ, గుంటూరు ఆసుపత్రులకు తరలించారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఒకరు మృతి చెందారు. నిన్న రాత్రి నుంచి ఆసుపత్రిలో 76 మంది చేరినట్టు సమాచారం. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి సంఖ్య 164కు చేరింది. ప్రవేటు ఆసుపత్రులలో మరో 60 మందికి చికిత్స పొందుతున్నారు. నీటి నమూనాల కల్చర్ టెస్ట్ నివేదికలు నేడు వచ్చే అవకాశం కనిపిస్తోంది. వింత రోగానికి మాస్ హిస్టీరియా కారణం అని అంటున్నారు సైక్రియాటిస్టులు.
న్యూరో టాక్జిన్స్ కారణం కావచ్చు అంటున్నారు ఎయిమ్స్ అధికారులు. ఈరోజు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీల నుండి నిపుణుల బృందాలు రానున్నాయి. మంగళగిరి ఎయిమ్స్ నుంచి ప్రత్యేక వైద్య బృందం కూడా రానుంది. అంతు చిక్కని వ్యాధికి వాయు కాలుష్యం కారణం కాదని కాలుష్య నియంత్రణ మండలి నిర్ధారణకి వచ్చింది. నగరంలో పలు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ టెస్టింగ్ మిషన్లు ఏర్పాటు చేసింది. ఉదయం 10గంటల 10 నిమిషాలకు ఏలూరు చేరుకోనున్న సియం జగన్ అనంతరం అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం ఏలూరు ఆసుపత్రిలో బాధితులను పరామర్శించనున్నారు జగన్.