రాష్ట్రంలో నెలకొన్న సమస్యల్లో ఇప్పుడు అత్యంత ప్రధానంగా చర్చకు వస్తున్న అంశం.. ఉద్యోగుల ఆందోళన. తమకు వేతనాలు పెంచాలని.. పీఆర్సీని ప్రకటించడంతో వేతనాలు తగ్గి పోయాయని పేర్కొంటూ.. ఉద్యోగులు ఆందోళన బాటపట్టారు. అయితే.. ఇప్పటికే పెంచామని.. హెచ్ ఆర్ ఏ పెంచితే. మొత్తం ప్రభుత్వ ఆదాయం అంతా కూడా.. ఉద్యోగులకే వెళ్లిపోతుందని.. ప్రభుత్వం చెబుతోంది. దీంతో ఇరు పక్షాల మధ్య వాద ప్రతివాదాలు.. కొనసాగుతున్నాయి. తలుపులు తెరిచే ఉన్నాయని ప్రబుత్వం చెబుతోంది. అయితే.. పీఆర్సీ పెంచుతామంటేనే చర్చలకు వస్తామని.. ఉద్యోగులు చెబుతున్నారు.
కానీ, ఆ ఒక్కటి తప్ప..! అని సర్కారు చెబుతోంది. ఇప్పటికే విరమణ వయో పరిమితిని రెండేళ్లు పెంచామని.. దీనివల్ల పాతిక లక్షలకు పైగానే లబ్ధి చేకూరుతుందని… ఇంకా ఎక్కడ నుంచి తెస్తామని ప్రభుత్వం ప్రశ్నిస్తోంది. అంతేకాదు.. జగనన్న టౌన్ షిప్‌లలో ఉద్యోగులకు 20 శాతం రిబేటుకు ఇళ్లు ఇస్తున్నామని .. ఇది కూడా లక్షల్లోనే వారికి తక్షణ లబ్ధి చేకూరుస్తుందని.. సర్కారు వాదిస్తోంది. అంతేకాదు.. కారుణ్య నియామకాలు, వారానికి రెండు రోజుల సెలవులు, బ్యాంకుల నుంచి రుణాలు ఇలా..అనేకం చూపిస్తోంది. పైగా.. కరోనాతో ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని అంటోంది.
వాస్తవానికి ప్రభుత్వం చెబుతున్న ప్రతి విషయంలోనూ.. న్యాయం ఉంది. అయితే.. ఉద్యోగులు మాత్రం తమకు హెచ్ ఆర్ ఏనే పెంచాలని పట్టుబడుతున్నారు. ఇది వివాదంగా మారుతోంది. ఈ క్రమంలోనే అసలు ప్రభుత్వం ఏచేస్తోందనే విషయాన్ని సర్కారు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించింది. తద్వారా.. ఉద్యోగులపై ప్రజలకు వ్యతిరేకత వస్తుందని.. అప్పుడు వారు దారికి వస్తారని సర్కారు భావిస్తోంది.
అయితే.. నిజానికి ప్రజల్లో వ్యతిరేకత వచ్చినా.. రాకున్నా..ఉద్యోగులకు వచ్చే నష్టం.. కష్టం ఏమీ ఉండదు. వారి వేతనాలు వారికి వస్తాయి. ఎటొచ్చీ.. ఈ ఉద్యమం సాగుతూ.. పోతే.. ప్రజలే ఇబ్బందులు పడతారు. సో.. ప్రభుత్వం మంచి చేయాలని అనుకున్నా.. దానిని ఒప్పించడంలోనే ఎక్కడో తేడా కొడుతోందని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటికైనా ఉద్యోగులకు నచ్చజెప్పడం ద్వారా.. సమస్యను త్వరగా పరిష్కరించాల్సిన అవసరం ఉదని అంటున్నారు.