ఆస్ట్రేలియా బ్యాటింగ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆసీస్ వికెట్లు పడినప్పుడల్లా వారు సాండ్ పేపర్ చూపించి ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఎగతాళి చేశారు.
ఇంగ్లండ్‌లోని బర్మింగ్‌హామ్ వేదికగా ప్రతిష్టాత్మక యాషెస్ 2019 సిరీస్ నిన్న ఆరంభమైన విషయం విదితమే. ఈ సిరీస్‌లో భాగంగా నిన్నటి నుంచి ప్రారంభమైన తొలి టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్‌లో 284 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం ఇంగ్లండ్ బ్యాటింగ్ ప్రారంభించి తొలి రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. అయితే ఆస్ట్రేలియా బ్యాటింగ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఆసీస్ వికెట్లు పడినప్పుడల్లా వారు సాండ్ పేపర్ చూపించి ఆస్ట్రేలియా ఆటగాళ్లను ఎగతాళి చేశారు.
గత ఏడాది మార్చిలో సౌతాఫ్రికాలోని కేప్‌టౌన్ లో ఆ దేశ జట్టుతో జరిగిన 3వ టెస్టు మ్యాచ్‌లో అప్పటి ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్, వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్‌లు తమ జట్టు ప్లేయర్ కేమరాన్ బ్యాన్‌క్రాఫ్ట్‌ను సాండ్ పేపర్ ఉపయోగించి బాల్ టాంపరింగ్ చేయమని చెప్పిన సంగతి తెలిసిందే. అయితే బ్యాన్‌క్రాఫ్ట్ సాండ్ పేపర్ ఉపయోగించి బాల్‌ను రుద్దుతుండడం కెమెరా కళ్లకు చిక్కింది. దీంతో అప్పట్లో ఈ ఘటనపై పెద్ద దుమారమే చెలరేగింది. అయితే స్మిత్, వార్నర్, బ్యాన్‌క్రాఫ్ట్‌లు తమ తప్పును అంగీకరించడంతో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు వారిపై ఏడాది కాలం పాటు నిషేధం విధించింది. వారిని ఏడాది పాటు ఎలాంటి ఫార్మాట్‌కు చెందిన క్రికెట్ మ్యాచ్‌లోనూ ఆడవద్దని చెప్పింది.
అయితే ఆ ముగ్గురిపై నిషేధం ముగిసి వారు మళ్లీ మంచి ఫామ్‌లోకి వచ్చారు. ఇప్పుడు యాషెస్ సిరీస్‌లో మళ్లీ ఆడుతున్నారు. కానీ వారిపై అప్పట్లో పడ్డ మచ్చను ఇంగ్లండ్ ఫ్యాన్స్ నిన్నటి మ్యాచ్‌లో మళ్లీ వారికి గుర్తు చేశారు. వార్నర్‌తోపాటు పలువురు ఇతర ఆసీస్ బ్యాట్స్‌మెన్ ఔట్ అయినప్పుడల్లా ఇంగ్లండ్ జట్టు ఫ్యాన్స్ ఆసీస్ ప్లేయర్లకు సాండ్ పేపర్ చూపించి వారిని హేళన చేశారు. అప్పట్లో సాండ్ పేపర్ ఉపయోగించి ఆసీస్ ప్లేయర్లు బాల్‌ను ఎలా టాంపరింగ్ చేశారో చూడండి.. అనే అర్థం వచ్చేలా ఇంగ్లండ్ ఫ్యాన్స్ రెచ్చిపోయి మరీ ఆసీస్ వికెట్లు పడినప్పుడల్లా వారికి సాండ్ పేపర్లను చూపించి ఆట ఆడుకున్నారు. దీంతో వారు సాండ్ పేపర్ చూపించిన ఆ వీడియోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతున్నాయి. ఏది ఏమైనా.. ఆ ముగ్గురు ఆసీస్ ప్లేయర్లు చేసిన తప్పును ఇప్పటికీ ఇంగ్లండ్ ఫ్యాన్స్ వారికి గుర్తు చేస్తూనే ఉన్నారన్నమాట. మరి ఇంగ్లండ్ టీంకు షాకిచ్చేలా ఆసీస్ ఈసారైనా ఇంగ్లండ్‌లో యాషెస్ గెలుస్తుందా.. లేదా.. చూడాలి..!
It’s a sandpaper send off from the Hollies.
David Warner gone for the second time today from Stuart Broad. #TheAshes | #ENGvAUS | #Edgbaston pic.twitter.com/I2xhk3MK2q
— Ploughmans CC (@PloughmansCC) August 1, 2019