టీ20 ప్రపంచకప్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ను ఇంగ్లండ్ ఓడించింది. నల్లేరుపై నడకలా సాగుతుందని అనుకున్న ఈ మ్యాచ్ చాలా నెమ్మదిగా ముందుకు సాగింది. పెర్త్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆఫ్ఘనిస్తాన్ 112 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఇంగ్లండ్ సులభంగా ఛేదిస్తుందని అంతా అనుకున్నారు. అయితే ఆఫ్ఘన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లు ఆడలేకపోయారు. ఈ క్రమంలోనే కెప్టెన్ జోస్ బట్లర్ (18), అలెక్స్ హేల్స్ (19) పెవిలియన్ చేరారు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మలాన్ (18), బెన్ స్టోక్స్ (2), హారీ బ్రూక్ (7) కూడా ఆకట్టుకోలేదు.
ఇలాంటి సమయంలో లియామ్ లివింగ్‌స్టోన్ (29 నాటౌట్) మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూనే వేగంగా బ్యాటింగ్ చేశాడు. అతనికి చివర్లో మొయీన్ అలీ (8 నాటౌట్) మంచి సహకారం అందించాడు. దీంతో ఆ జట్టు 18.1 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసి విజయం సాధించింది. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో ఫజల్లాక్ ఫరూకీ, ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్, ఫరీద్ అహ్మద్, మహమ్మద్ నబీ తలో వికెట్ తీసుకున్నారు. ఆఫ్ఘన్ బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టించి, ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్న శామ్ కర్రాన్‌ను ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.