నిన్న బిజేపి తీర్థం పుచ్చుకున్న ఏనుగు రవీందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మరో ఉద్యమం మొదలైందని.. సీఎం కేసీఆర్ ను గద్దె దించడమే బిజెపి లక్ష్యమని హెచ్చరించారు. అంతం మొదలైందని గ్రహించిన కేసీఆర్ అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఒక్కసారి ఓడిపోయినందుకు తనకు తన కార్యకర్తలకు సభ్యత్వాన్ని సీఎం కేసీఆర్ ఇవ్వలేదని చురకలు అంటించారు. కెసిఆర్ 100 తప్పులను గ్రహించి ఈటల రాజేందర్ వెంట బీజేపీలోకి వెళ్ళామని స్పష్టం చేశారు ఏనుగు రవీందర్ రెడ్డి. రానున్న 2023 ఎన్నికల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 ఎమ్మెల్యే స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటామని…రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని తెలిపారు ఏనుగు రవీందర్ రెడ్డి.
కాగా నిన్న ఢిల్లీ బీజేపీ జాతీయ కేంద్ర కార్యాలయంలో ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కాషాయ కండువా కప్పారు. ఈటలకు సభ్యత్వం ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, కరీంనగర్ జడ్పీ మాజీ చైర్‌పర్సన్ తుల ఉమ, గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, అందె బాబయ్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.