కోవిడ్ నేపథ్యంలో దేశవ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జోరుగా కొనసాగుతోంది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలను ప్రస్తుతం ప్రజలకు ఇస్తున్నారు. త్వరలోనే మరిన్ని కంపెనీలకు చెందిన టీకాలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. టీకాలకు సంబంధించి రెండు డోసులు తీసుకున్న వారిలో తగిన సంఖ్యలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. అవి కోవిడ్ నుంచి రక్షణను అందిస్తాయి. అయితే ఏ కంపెనీకి చెందిన టీకాను అయినా రెండు డోసులూ తీసుకున్నా కొందరిలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవడం లేదని తేలింది. మరి అలాంటి వారు ఏం చేయాలి ? వారికి కోవిడ్ నుంచి రక్షణ ఎలా అంటే..?
సాధారణంగా మన శరీరం ఇన్‌ఫెక్షన్‌లకు రెండు రకాలుగా స్పందిస్తుంది. ఒకటి హ్యుమోరల్ కాగా, రెండోది సెల్యులార్. హ్యుమోరల్ స్పందనలో శరీరం యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తుంది. అవి ఇన్‌ఫెక్షన్లకు కారణం అయ్యే సూక్ష్మ క్రిములను చంపుతాయి. ఇక సెల్యులార్ స్పందనలో టి సెల్స్ యాక్టివేట్ అవుతాయి. అవి బి సెల్స్ సహకారంతో యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయి. దీంతో అవి సూక్ష్మ జీవులను చంపుతాయి. ఈ విధంగా మన రోగ నిరోధక వ్యవస్థ పనిచేస్తుంది. టీకాలను తీసుకున్న తరువాత కూడా సరిగ్గా ఇలాగే జరుగుతుంది.
అయితే కొందరిలో హ్యుమోరల్ స్పందన విధానంలో యాంటీ బాడీలు ఉత్పత్తి కావడం లేదు. వారు రెండు డోసు టీకాలను తీసుకున్న తరువాత కూడా వారిలో యాంటీ బాడీలు ఉత్పత్తి కావడం లేదని టెస్టుల ద్వారా వెల్లడైంది. అయినప్పటికీ వారిలో టి సెల్స్ యాక్టివేట్ అయి అవి బి సెల్స్ సహాయంతో యాంటీ బాడీలను ఉత్పత్తి చేస్తాయని, అవి మనకు కోవిడ్ నుంచి రక్షణను అందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు. కనుక రెండు డోసుల టీకాలను తీసుకున్న వారు టెస్టులు చేయించుకుంటే అందులో యాంటీ బాడీలు లేనట్లు వస్తే కంగారు పడాల్సిన పనిలేదని చెబుతున్నారు. హ్యుమోరల్ స్పందన విధానంలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాకపోయినా సరే టి సెల్స్ యాక్టివేట్ అయి తమ పని తాము చేస్తాయని చెబుతున్నారు.
అయితే టి సెల్స్ ను సహజంగానే యాంటీ బాడీ టెస్టుల ద్వారా గుర్తించలేం. అంతమాత్రం చేత అవి ఉత్పత్తి కానట్లు కాదు. కానీ కొందరు రెండు డోసుల టీకాను తీసుకున్న తరువాత కూడా యాంటీ బాడీలు ఉత్పత్తి కాకపోవడం వల్ల కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కు గురై చనిపోతున్నారు. అలాంటి వారిలో టి సెల్స్ ను గుర్తించే టెస్టులు చేయాలని అంటున్నారు. దీంతో టి-సెల్స్‌పై ఒక అవగాహనకు రావచ్చని, హ్యుమోరల్ స్పందనలో యాంటీ బాడీలు ఉత్పత్తి కాకపోయినా టి సెల్స్ ద్వారా అవి ఉత్పత్తి అవుతాయి కనుక అవి ఏ విధంగా వైరస్‌ను అడ్డుకుంటాయో పరిశీలించాలని అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలను తెలుసుకోవాల్సి ఉందని చెబుతున్నారు. అయినప్పటికీ యాంటీ బాడీలు ఉత్పత్తి కాకపోయినంత మాత్రాన కంగారు పడాల్సింది లేదని, కోవిడ్ టీకాలు రక్షణను అందిస్తాయని సైంటిస్టులు చెబుతున్నారు.