ప్రపంచం తలకిందులైనా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. ‘అక్కడి సూర్యుడు ఇక్కడ పొడిచినా రుణమాఫీ ఆగదు. అది పూర్తి చేసి రైతుల రుణం తీర్చుకుంటాం’ అని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ లో నష్టమని తెలిసినా సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ తెలంగాణ ఏర్పాటే తప్పిదమన్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నోసార్లు మాట్లాడారని మండిపడ్డారు.
రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేసేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ నిర్ణయం, ప్రత్యేక పరిస్థితుల్లో నాకు సీఎం పదవి ఇచ్చిన్రు. ఈపదవిని బాధ్యతగా చూశాను తప్పా.. ఏనాడు అహంకారంతో కుర్చీలో కూర్చోలేదని, పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం రోజుకు 18 గంటలు పనిచేస్తున్నానని రేవంత్ రెడ్డి అన్నారు.అరవై ఏళ్ల ఆకాంక్ష, 1200 మంది విద్యార్థుల బలిదానంతో వచ్చిన తెలంగాణ.. పదేళ్ల పాటు కేసీఆర్ గడిలో బందీ అయిందని,ఇది చూసి తెలంగాణ తల్లి కన్నీళ్లు పెడుతుంటే.. కాంగ్రెస్ కార్యకర్తలు ఏకమై తెలంగాణ తల్లికి విముక్తి కలిగించారని రేవంత్ రెడ్డి తెలిపారు.