చప్పట్లు కొట్టడం ఏంటి… గతంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చినట్లు గానే ప్రస్తుతం ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి.. కరోనా వైరస్ విషయంలో ఏమైనా పిలుపునిచ్చారా అనే అనుమానం మీకు రావచ్చు. అయితే చప్పట్లు కొట్టాలని అని చెప్పింది సీఎం జగన్.. కానీ కరోనా గురించి కాదు. గత ఏడాది అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థను సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
సరిగ్గా నేటికి ఈ వ్యవస్థ ప్రారంభమై ఏడాది ముగిసింది. గ్రామ పాలన విషయంలో గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ వ్యవస్థ ప్రారంభం అయ్యి ఏడాది పూర్తయిన సందర్భంగా గ్రామ స్వరాజ్యం ని సాధ్యం చేస్తున్న ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపే విధంగా ఈరోజు సాయంత్రం ఏడు గంటల సమయంలో రాష్ట్ర ప్రజలు అందరూ చప్పట్లు కొట్టి తమ మద్దతు తెలపాలంటూ సీఎం జగన్ పిలుపునిచ్చారు. కాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి… ఆయన నివాసం నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం 7 గంటల సమయంలో చప్పట్లు కొట్టనున్నారు.