ఆలేరు మాజీ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నేత భిక్షమయ్య గౌడ్ బీజేపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు. నేడు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్.. బీజేపీలో చేరనున్నారు. ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో భిక్షమయ్య గౌడ్.. బీజేపీలో చేరనున్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు పలువురు కీలక నాయకులు పాల్గొననున్నారు. కాగ మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్.. బీజేపీలో చేరుతున్న నేపథ్యంలో ఒక లేఖను కూడా విడుదల చేశారు. ఆ లేఖలో భిక్షమయ్య గౌడ్… ఆలేరు నియోజక వర్గం అభివృద్ధి కోసం 2018 లో టీఆర్ఎస్ లో చేరానని అన్నారు.
అభివృద్ధి లో తనను భాగస్వామిని చేస్తారని భావించానని అన్నారు. కానీ తనను ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారని ఆరోపించారు. ఆలేరు నియోజక వర్గ ప్రజల నుంచి తనను వేరు చేయాలని కుట్ర చేశారని మండిపడ్డారు. నియోజక వర్గం ప్రజలతో తాను సమావేశం కావద్దని టీఆర్ఎస్ పెద్దలు తనను ఆదేశించారని తెలిపారు.
ప్రజల నుంచి తనను వేరు చేయాలను కుట్రను తాను ఛేదిస్తున్నానని అన్నారు. ఆలేరు నియోజక వర్గం ప్రజల కోసం బీజేపీలో చేరుతున్నట్టు లేఖలో ప్రకటించారు. కాగ భిక్షమయ్య గౌడ్ ముందుగా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. తర్వాత 2018లో టీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు బీజేపీ కండువ కప్పకోవడానికి సిద్ధం అయ్యారు.