టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ హాస్యనటుడు వేణు మాధవ్ కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతోన్న ఆయన సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మధ్యాహ్నం మృతిచెందారు. 1979లో తెలంగాణలోని సూర్యాపేట జిల్లా కోదాడ మండలంలో జన్మించిన ఆయన నాల్గవ ఏట నుండే మిమిక్రీ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1997లో ఎస్వీ కృష్ణారెడ్డి డైరెక్ట్ చేసిన సంప్రదాయం సినిమాతో వెండి తెరకు పరిచయం అయ్యారు.
ఇక అక్కడ నుంచి ఆయన కమెడియన్గా వెనుదిరిగి చూసుకోలేదు. పవన్కళ్యాణ్ తొలిప్రేమ సినిమాతో కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. వేణుమాధవ్ నాలుగేళ్లుగా లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఈ వ్యాధి రోజు రోజుకు తీవ్రమై వేణుమాధవ్ ఆరోగ్యాన్ని పూర్తిగా నాశనం చేసేసింది.
ఆ తర్వాత కిడ్నీల వ్యాధి కూడా సోకడంతో వేణుమాధవ్ ఆరోగ్యం మరింత క్షీణించింది. కొద్ది రోజులుగా ఆయన డయాలసిస్ కూడా చేయించుకుంటున్నట్టు సమాచారం. పరిస్థితి బాగా విషమించడంతో ఈనెల 7వ తేదీన ఆయనను చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు యశోదా ఆస్పత్రిలో చేర్చారు. అయితే వేణు మాధవ్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో నిన్నటి నుంచే వార్తలు హల్చల్ చేశాయి.
ఇక వేణుమాధవ్ మృతికి లివర్, కిడ్నీలు పాడవ్వడమే కారణమని తెలుస్తోంది. ఆయన నిన్నటి నుంచే చనిపోయినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం ఆయన మరణించినట్లు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు అధికారికంగా నిర్థారించారు.