- టెలిఫోన్ ఆపరేటర్ నుంచి నటుని దాకా..
- వెంట్రిలాక్విజమ్‌తో గుర్తింపు
- చిత్రపరిశ్రమలో మంచిపేరు
- అవకాశాలు రాకపోవడంతో రాజకీయాల్లోకి
- కిడ్నీ సమస్యతో ఆస్పత్రిలో చేరిక
- పరిస్థితి విషమించి మృతి
తెలుగు సినిమాల్లో ఆయన నవ్వులు ఇక కనిపించవు. సహజమైన హస్యంతో అందరినీ నవ్వించిన ఆ నటుడు అందరికీ దూరమయ్యాడు. టాలీవుడ్‌లో ప్రముఖ హస్యనటుడిగా అందిరినీ అలరించిన వేణుమాధవ్ ఈరోజు మద్యాహ్నం 12 : 21 నిమిషములకు తుదిశ్వాస విడిచారు. తీవ్ర అస్వస్థతతో మంగళవారం రాత్రి యశోధ ఆస్పత్రిలో చేరిన ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. టీడీపీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్‌గా ప్రారంభం అయిన ఆయన జీవిత ప్రయాణం ప్రముఖ తెలుగు చిత్రపరిశ్రమలో మంచి పేరు తెచ్చుకొనే వరకూ సాగింది. అయితే. కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. ఇటీవల ఆయనకు కిడ్నీ సమస్య రావడంతో కుటుంబ సభ్యులు ఆయన్ని సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఆయనకు వెంటిలేటర్ సాయంతో అత్యవసర చికిత్స అందించారు. కొన్ని గంటల చికిత్స తర్వాత పరిస్థతి విషమించి ఆయన తుది శ్వాస విడిచారు. ఇదిలా ఉండగా హీరో రాజశేఖర్, ఆయన సతీమణి జీవిత యశోద ఆస్పత్రికి వెళ్లి వేణుమాధవ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కుటుంబ సభ్యులు, డాక్టర్లతో మాట్లాడారు. వేణుమాధవ్ ఆరోగ్యంపై గతంలో చాలా రూమర్లు వచ్చాయి. ఆయన చనిపోయారంటూ కూడా ప్రచారం చేశారు. ఈ వార్తలపై వేణుమాధవ్ చాలా సార్లు స్పందించారు. తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, ఇప్పుడు వేణుమాధవ్ ఇప్పుడు దూరం అవడం అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఆవేధన నింపుతున్నది.
గత కొద్ది రోజులగా సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో వేణుమాధవ్ రాజకీయాల్లోకి వచ్చారు. నంద్యాల ఉపఎన్నికల్లో టీడీపీ తరఫున ప్రచారం చేశారు. ఆ తరవాత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన స్వస్థలమైన కోదాడ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసినా ఎన్నికల అధికారి దాన్ని తిరస్కరించారు. దీంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు.
పుట్టింది…
వేణుమాదవ్ పుట్టింది నల్గొండలో. పెరిగింది కోదాడ లో. నాన్న టెలిఫోన్ డిపార్ట్‌మెంట్ లో లైన్ ఇన్‌స్పెక్టర్. అమ్మ ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్. చదువంతా కోదాడలోనే సాగింది. ఒకటో తరగతి నుంచి డిగ్రీ దాకా మొత్తం తెలుగు మీడియం లోనే చదివాడు. ఇంగ్లీషు పెద్దగా రాదని ఆయనే చెప్పుకుంటుంటాడు. ఐదో తరగతి దాకా ఊళ్ళోనే ఉన్న ప్రాథమిక పాఠశాలలో చదివాడు. తరువాత ఆరో తరగతి కోసం జిల్లా పరిషత్ పాఠశాలలో చేరాడు. నాలుగో తరగతి నుంచే మిమిక్రీ చెయ్యడం ప్రారంభించాడు. అమితాబ్ బచ్చన్, ఎన్టీఆర్ పాటలకు డ్యాన్సులేయడం, వారిని అనుకరించి మాట్లాడటం మొదలైనవన్నీ చేసేవాడు.
గుర్తింపు తెచ్చిన వెంట్రిలాక్విజమ్..
వేణుకు వెంట్రిలాక్విజం మీద బాగా ఆసక్తిగా ఉండేది. అదే ఆసక్తితో బాంబే (ప్రస్తుతం ముంబై) నుంచి ప్రత్యేకంగా రూపొందించిన ఒక బొమ్మ తెచ్చుకున్నాడు. కోదాడలో వెంట్రిలాక్విజాన్ని మొదటి సారి ప్రజలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆయన చదివే కళాశాల ప్రిన్సిపల్ ని కలిస్తే వార్షికోత్సవానికి వేణు ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ కార్యక్రమానికి ఆ ప్రాంతపు అప్పటి శాసన సభ్యులు చందర్ రావు వచ్చి ఆ ప్రదర్శనను తిలకించడం జరిగింది. ఆయన ఎంతో ముచ్చటపడి భువనగిరిలో ఆయన పార్టీ మీటింగ్ లో కూడా అలాంటి ప్రదర్శన ఇవ్వమన్నాడు. ఆ మీటింగ్ కి వచ్చిన రాష్ట్ర మాజీ హోం శాఖా మంత్రియైన కీ.శే ఎలిమినేటి మాధవ రెడ్డి కూడా వేణుమాధవ్ ను నల్గొండ పార్టీ మీటింగ్ లో కూడా ప్రదర్శన ఇవ్వమన్నాడు. నల్గొండ ప్రదర్శన చంద్రబాబు నాయుడు చూసి, మహానాడులో ప్రదర్శన ఇవ్వమన్నాడు. మహానాడు ప్రదర్శనలో తెలుగుదేశం పార్టీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల గురించి చెప్పాడు.
సీనియర్ ఎన్టీయార్ పరిచయంతో..
సభ అయిపోయిన తరువాత ఎన్టీఆర్ వేణు దగ్గరికి వచ్చి ”మీ సేవలు మా కెంతో అవసరం బ్రదర్” అని చెప్పి చంద్రబాబునాయుడు వైపు తిరిగి ”వీరిని మనతో పాటే ఉంచండి” అని అన్నాడు. అలా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ పరిచయమైంది.ఆ పరిచయంతో వేణుకు హిమాయత్‌నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టెలిఫోన్ ఆపరేటర్ గా ఉద్యోగం ఇచ్చారు. అందులో పది కాల్స్ వస్తే తొమ్మిది కాల్స్ వేణుకు వచ్చే వ్యక్తిగత కాల్స్‌గా ఉండేవి. క్రమంగా పార్టీ కార్యక్రమాలకు అందకుండా పోయేవాడు. దాంతో వాళ్ళు ఇలాకాదని, అసెంబ్లీ లోని టీడీఎల్పీ ఆఫీసులో లైబ్రరీ అసిస్టెంటుగా చేర్చారు. తరువాత ఎన్టీఆర్ ఇంట్లో అసిస్టెంట్ గా కూడా కొద్దిరోజులు పనిచేశాడు. బొమ్మతో మిమిక్రీ చేస్తాడు కాబట్టి ఎన్టీయార్ ఆయన్ని ”బొమ్మగారూ!” అని ఆప్యాయంగా పిలిచేవారు.
ఎన్టీఆర్ తర్వాత రామోజీరావంటే ఆయనకు గౌరవం, అభిమానం. అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డి ల చలవతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకున్నాడని ఆయన గట్టి నమ్మకం. అందుకనే ఆయన కట్టుకున్న ఇళ్ళకు అచ్చొచ్చిన కృష్ణ నిలయం అని పేరు పెట్టుకుని అభిమానం చాటుకున్నాడు.
సినీ ప్రస్థానం…
అసెంబ్లీలో పని చేసేటప్పుడు ఖాళీ సమయాల్లో ఎదురుగా ఉన్న రవీంద్ర భారతికి వెళ్ళడం అలవాటైంది. ఒక సారి ఆకృతి సంస్థ వాళ్ళు మాటల రచయిత దివాకర్ బాబుకు సన్మానం చేస్తుంటే చూడ్డానికి వెళ్ళాడు. అందులో వేదికపైన ఒక చిన్న ప్రదర్శన ఇచ్చాడు. దాన్ని చూసి అచ్చిరెడ్డి, కృష్ణారెడ్డిలు చూసి సినిమాలలో అవకాశం ఇచ్చారు. ఆయన మొదటి సినిమా ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా. తొలిప్రేమ సినిమాలో అమ్మాయిలపైన చాటభారతమంత డైలాగును ఆయన్ను ప్రేక్షకులకు చేరువ చేసింది. దిల్ సినిమాతో మంచి పేరు వచ్చింది. లక్ష్మి సినిమాతో ఉత్తమ హాస్యనటుడిగా నంది అవార్డును అందుకున్నాడు.
సాధారణ స్థాయి నుంచి తెలుగు ఇండస్ట్రీలో తనదైన గుర్తింపు పొందారు వేణు మాదవ్. ఇలా 1996లో ‘సాంప్రదాయం’ సినిమా ద్వారా నటుడిగా పరిచయమ్యారు. ‘మాస్టర్’, ‘తొలిప్రేమ’, ‘సుస్వాగతం’, ‘తమ్ముడు’ సినిమాలతో హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దశాబ్దన్నర కాలంపాటు హాస్యనటుడిగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ‘హంగామా’ సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు. సామాన్యమైన స్థాయి నుంచి పరిశ్రమలో అందరి మన్ననలూ అందుకున్న వేణుమాదవ్ మరణం తెలుగుహస్యాభిమానులకు తీరని లోటు.