ఎంఐ ప్రోడక్ట్ కొంటున్నారా ? తస్మాత్ జాగ్రత్త !

అదేంటి అనుకుంటున్నారా ? అవును నిజమే, ఆ ప్రోడక్ట్ లను కొనే ముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా బెంగళూరు, చెన్నైలో రూ .33.3 లక్షల విలువైన నకిలీ షియోమి(ఎంఐ) ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ‘నకిలీ’ షియోమి ఉత్పత్తులను అమ్మినందుకు ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నకిలీ ఉత్పత్తులు చెన్నైలోని నలుగురు సరఫరాదారులు మరియు బెంగళూరులో ముగ్గురు సరఫరాదారుల నుండి స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మొబైల్ బ్యాక్ కేసులు, హెడ్‌ ఫోన్లు, పవర్ బ్యాంకులు, ఛార్జర్లు మరియు ఇయర్‌ ఫోన్‌లతో కూడిన 3000కి పైగా ఎంఐ ఉత్పత్తులు ఈ రైడ్ లో దొరికాయి.

బెంగళూరులో 24.9 లక్షల, చెన్నైలో 8.4 లక్షల విలువైన నకిలీ ఎంఐ ఇండియా ఉత్పత్తులను విక్రయించినందుకు రెండు నగరాల నుండి దుకాణ యజమానులను అరెస్టు చేశారు. ఇక  ఈ ఆపరేషన్ తన నకిలీ నిరోధక కార్యక్రమంలో భాగమని షియోమి తెలిపింది. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో అక్టోబర్, నవంబర్ నెలల్లో మార్కెట్లో దాడులు జరిగాయి. రిజిస్టర్ ఫిర్యాదు తర్వాత, పోలీసు అధికారులు మరియు కంపెనీ ప్రతినిధులు ఈ ప్రాంతంలో మూడు ప్రముఖ దుకాణాల నుంచి ఈ  నకిలీ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు.