దేశ వ్యాప్తంగా జరుగుతున్న ప్రస్తుతం జరుగుతున్న చర్చ మావో సిద్దాంతాలకి కాలం చెల్లిందా?. పీడించే బడే వాళ్లున్నంత కాలం.. పిడించే వాళ్లు బ్రతికి వున్నంతకాలం మావో సిద్ధాంతం ఎప్పటికీ చెక్కు చెదరదు అన్నది మావో యిస్టులు చెప్పే మాట. భూమి కోసం. భుక్తి కోసం, పీడిత జన విముక్తి కోసం తెలంగాణ రైతాంగ పోరాటం జరిగింది. ఆ తరువాత పుట్టుకొచ్చిన భూస్వామ్య, పెత్తందారీ వ్యవస్థపై తిరుగు బాటు బావుటా ఎగురవేసే క్రమంలో అది నక్సల్‌బరి ఉద్యమంగా మారి పీపుల్స్ వార్ ఉద్యమానికి దారి తీసింది.
గత కొన్ని దశాబ్దాలుగా ఈ ఉద్యమం సాగుతూనే వుంది. ఎంతో మంది ఈ ఉద్యమంలో ప్రాణాలు విడిచారు. పోలీసులు కూడా భారీ స్థాయిలోనే ప్రాణాలు కోల్పోయారు. గత కొంత కాలంగా ఈ ఉద్యమం గాడి తప్పింది. పోలీసులకి, ఉద్యమ కారులకు మధ్య సమరంగా మారింది. ప్రజలకు అందు బాటులో వుండే ఉద్యమకారులు గత దశాబ్ద కాలంగా కీకారణ్యాలకే పరిమితం కావడంతో ప్రజలకూ ఉద్యమ కారులకూ మధ్య దూరం పెరిగింది. ఆదరణ కరువైంది.
తాజాగా మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగిపోతున్నారనే వార్తల నేపథ్యంలో మళ్లీ మావోయిజంపై చర్చ మొదలైంది. మావోయిస్టు కీలక నేత ముప్పాల్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి త్వరలో లొంగి పోతున్నారంటూ వరుస కథనాలు రావడంతో దీనిపై దేశ వ్యాప్తంగా పెద్ద చర్చ మొదలైంది. పీపుల్స్ వార్ ఉద్యమం కాస్త మావోయిస్టు పార్టీగా అవతరించడంలో గణపతి కీలక భూమిక పోషించారు. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా ఈ ఉద్మమాన్ని విస్తరించడంలో గణపతి ప్రధాన భూమికను పోషించారు. అలాంటి వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల లొంగిపోతున్నారంటూ వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఈ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, ఇది కేవలం పోలీసు శాఖ పుట్టించిన పుకారని కేంద్ర కమిటీ సభ్యులు ఓ పత్రికా ప్రకటనని విడుదల చేయడంతో గణపతి లొంగిపోతున్నారన్నది ఓ కట్టుకథ అని తేలిపోయింది.
ఇదే సమయంలో మావోయిస్టు సిద్ధాంతాలకి కాలం చెల్లిపోలేదని, అయితే దాన్ని అమలు చేయడంలోనే నాయకత్వ వైఫల్యం కనిపిస్తోందని, వ్యక్తుల సిద్ధాంతాల్లో మార్పులు వస్తేనే ఉద్యమం మరింత కాలం మనుగడ సాగిస్తుందని, లేదంటే కాల క్రమేనా అంతరించి పోతుందని ప్రజాస్వామ్య వాదులు, సామాజిక వేత్తలు అభిప్రాయ పడుతున్నారు.