భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో అంపైర్ల తీరుపై విమర్శలు వస్తున్నాయి. న్యూజిలాండ్ జట్టు ఎలాంటి రివ్యూ కోరకముందే అంపైర్లు రివ్యూకి వెళ్ళడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇక జరిగిన విషయానికి వస్తే డబ్ల్యూటీసీ ఫైనల్లో భాగంగా… భారత మొదటి ఇన్నింగ్స్ 40వ ఓవర్‌ను ట్రెంట్ బౌల్ట్ వేసాడు. ఈ ఓవర్ చివరి బంతిని విరాట్ కోహ్లీ ఆన్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించగా… బంతి బ్యాటుకు తగలకుండ మిస్ ఆయి వికెట్ కీపర్ చేతుల్లో పడింది. ఆ సమయంలో బంతి బ్యాటుకు తాకినట్టు స్వల్ప శబ్దం వినిపించింది. దీంతో న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను బౌలర్ బౌల్ట్ దగ్గరికి వెళ్లి రివ్యూ కోరడంపై చర్చించాడు. అయితే అప్పటికే రివ్యూ కోసం నిర్దేశించిన గడువు 15 సెకన్ల సమయం కూడా అయిపొయింది.
అయితే హఠాత్తుగా మైదానంలోని అంపైర్లు మైకేల్ గాఫ్, రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ బ్యాట్స్‌మన్ ఔటయ్యాడా లేదో తెలుసుకొనేందుకు మూడో అంపైర్‌ను కెటిల్‌బరోను సంప్రదించారు. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. బ్యాట్స్‌మన్ ఔటా కాదా అని ఆన్ ఫీల్డ్ అంపైర్ తన నిర్ణయం ఇవ్వకపోగా… ఆటగాళ్లు అప్పీల్ చేయకున్నా, రివ్యూ సమయం దాటినా అంపైర్లు సమీక్షకు వెళ్ళారు. ఇక అంపైర్ల పద్ధతి మాజీ క్రికెటర్లు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.