ఏపీలో ఫైనాన్సియల్ ఎమర్జెన్సీ విధించాలని.. ఏపీలో ఆర్టికల్ 360ను కేంద్రం తక్షణమే ప్రయోగించాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల డిమాండ్ చేశారు. రూ. 48 వేల కోట్ల లెక్కల్లోకి రాని ఖర్చుపై సీబీఐ విచారణ జరిపించాలని.. ప్రస్తుత ఆర్ధిక మంత్రి కాగ్ నోటింగ్స్ పై జవాబివ్వడం లేదు.. కుండా, సంజాయిషీ చెప్పడం లేదని నిప్పులు చెరిగారు.
సీఎఫ్ఎంఎస్ విధానాన్ని బైపాస్ చేయడం, ట్రెజరీ కోడ్ ఉల్లంఘన జరిగిందని.. అక్రమ బిల్లులు పాస్ చేసుకోవడానికే ప్రత్యేక బిల్లుల పేరుతో అనుచిత రాటిఫికేషన్లను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లొసుగులన్నీ బయట పడేసరికి దిక్కుతోచక మాపై ఎదురుదాడి చేశారని.. సీఎఫ్ఎంఎస్ ను బైపాస్ చేసి బ్యాక్ ఎండ్ ట్రాన్సాక్షన్సును ఎలా అనుమతిస్తారు..? అని ఆగ్రహించారు.
నిధుల దుర్వినియోగానికి అవకాశం ఉందనే కాగ్ నివేదికలోని కామెంట్ బుగ్గనకు కనబడలేదా..? స్పెషల్ బిల్స్ నిర్వహణ ఆమోదయోగ్యం కాదన్న కాగ్ వ్యాఖ్య కూడా ఆర్ధిక మంత్రికి కనిపించ లేదా..? అని ప్రశ్నించారు. వేజ్ అండ్ మీన్స్ కింద తీసుకున్న రూ. 1.04 లక్షల కోట్లు ఏమయ్యాయి..? అని నిలదీశారు. ఓవర్ డ్రాఫ్ట్ కింద తీసుకున్న రూ 31 వేల కోట్లు ఏమయ్యాయి..? ప్రశ్నించారు. వడ్డీతో సహా వాటిని తిరిగి చెల్లించినా ఆ మొత్తాన్ని ఏం చేశారో చెప్పాల్సిన పని లేదా..? వీటన్నింటినీ గమనిస్తే, గతంలో ప్రభుత్వ ఖజానా కొల్లగొట్టిన బీహార్లో దాణా కుంభకోణం గుర్తు రావడం లేదా..? అని నిప్పులు చెరిగారు.