హైదరాబాద్ లో కూకట్ పల్లిలో భారీ అగ్నిప్రమాదం సంభవించి.. రెండు షాపులు, 10కి పైగా వాహానాలు దగ్ధం అయ్యాయి. కూకట్ పల్లి సమీపంలో జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ కూలర్ల షాపులో.. షాపు మూసివేసిన అనంతరం రాత్రి 11 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. మంటలు ఒక్కసారిగా వ్యాపించడంతో పక్కనే ఉన్న టైరు పంక్చర్ షాపుకు మంటలు అంటుకున్నాయి. స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా ఎంతకీ మంటలు ఆరకపోవడంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు.
ఆ మంటలు వేగంగా వ్యాపిస్తూ.. ఆ పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఆవరణలోని 10 ద్విచక్ర వాహానాలకు మంటలు అంటుకున్నాయి. ఈ లోపు ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సత్వర చర్యలు తీసుకోవడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈ ప్రమాదంలో అదృష్టవశాత్తు ప్రాణ నష్టం జరలేదు. కానీ ఆస్తి నష్టం జరిగిందని పోలీసులు తెలిపారు. అలాగే ప్రమాదానికి సంబందించిన కారణాలు తెలియరాలేదని, ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.