సికింద్రాబాద్ రాంగోపాల్‌పేట అగ్నిప్రమాద ఘటనలో మంటలు పూర్తిస్థాయిలో అదుపులోకి వచ్చాయి. 22 ఫైరింజన్లతో ఫైర్ సిబ్బంది మంటలు అర్పేందుకు తీవ్రంగా శ్రమించారు. ఘటన జరిగిన వెంటనే ఫైరింజన్లు వచ్చాయని.. ప్రస్తుతం సిటీలోని అన్ని ఫైరింజన్లు ఇక్కడే ఉన్నాయని ఫైర్ డీజీ నాగిరెడ్డి తెలిపారు. ఘటనలో నలుగురిని కాపాడామని ఆయన తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తుండగా ఇద్దరు సీనియర్ ఆఫీసర్లకు తీవ్రగాయాలు అయ్యాయని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. అగ్నిప్రమాదం జరిగిన భవనానికి సంబంధించి 4, 5 అంతస్తులకు అనుమతి లేదని జీహెచ్ఎంసీ అధికారులు ధృవీకరించారు. రేపు బిల్డింగ్ను జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించనున్నారు. బిల్డింగ్ యజమానిపై క్రిమినల్ కేసు పెట్టే అవకాశం ఉంది. ఐదు అంతస్థుల బిల్డింగ్లో ఫైర్ సేఫ్టీ నిబంధనలు శూన్యమని తెలుస్తోంది. కార్ డెకర్స్, స్పోర్ట్స్ స్టోర్ లకు మాత్రమే ట్రేడ్ లైసెన్స్ ఉన్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. గోడౌన్కు ఎటువంటి పర్మిషన్ లేదని స్పష్టం చేశారు. మరోవైపు బిల్డింగ్ పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.