కరోనా అలెర్ట్: శ్రీకాకుళాన్నీ చెడగొట్టేస్తున్నారా?

-

ప్రస్తుతం ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు కరోనా భారినపడకుండా ప్రశాంతంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. మిగిలిన జిల్లాలన్నీ కరోనా గుప్పిట్లోకి చేరి విలవిల్లాడుతుంటే… ఈ రెండు జిల్లాలు మాత్రం ఉన్నంతలో కాస్త రిలాక్స్డ్ గానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. సరిగ్గా… ఈ సమయంలో తా జెడ్డ కోతి వనమెల్లా చెరచిందిట అన్నట్లుగా ఒక వ్యక్తి ప్రవర్తించాడు. ప్రశాంతంగా ఉన్న శ్రీకాకుళంలో టెన్షన్ వాతావరణం సృష్టించాడు… ఇప్పటివరకు ఒక్క కరోనా పాజిటివ్ కూడా నమోదు కాక, నెం. 1 గ్రీన్ జోన్ గా ఉన్న జిల్లాకు కరోనా రుచిచూపించే ప్రయత్నం చేస్తున్నాడు!


వివరాళ్లోకి వెళ్తే… ప్రభుత్వాలు పొద్దున్నుంచి రాత్రివరకూ చెబుతున్న ఒకే ఒక్క విషయం… ఎక్కడివాళ్లు అక్కడే ఉండండి.. భౌతిక దూరం పాటించండి.. మాస్కులు ధరించండి అని. ఆ విషయం పెడచెవిన పెట్టిన ఒక వ్యక్తి రెడ్ జోన్ గా ఉన్న గుంటూరు నుంచి శ్రీకాకుళానికి చేరుకున్నాడు! గుంటూరులోని మిర్చి యార్డ్ లో కూలీగా పనిచేస్తున్న అతను.. లాక్ డౌన్ కారణంగా అంతా స్తంభించిపోవడంతో ఎలాగైనా తన స్వగ్రామం చేరుకోవాలని భావించి.. కొంత దూరం లారీల్లో, ఇంకొంత దూరం లిఫ్ట్ లు అడిగి, మరికాస్త దూరం నడిచి ఎలాగోలా శ్రీకాకుళానికి చేరుకున్నాడు. హమ్మయ్య అనుకునేలోపు… అప్పటికే అతడికి తీవ్రమైన జ్వరం, దగ్గు ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది! ఇంకేముందు శ్రీకాకుళం ఉలిక్కిపడింది!

అలా ఎంతో కష్టపడి గమ్యస్థానానికి చేరుకున్నా ఈ వ్యక్తిని స్థానికులు గ్రామంలోకి రానివ్వకుండా గ్రామ వాలంటీర్లకు సమాచారం ఇచ్చారు. దీంతో ఇతడి ఆరోగ్య పరిస్థితి కూడా అనుమానాస్పదంగా ఉండడంతో వెంటనే రాజాంలోని ప్రభుత్వ హాస్పిటల్ కు తీసుకెళ్లారు స్థానిక గ్రామ వాలంటీర్లు. అక్కడ్నుంచి నేరుగా జిల్లా హాస్పిటల్ లోని ఐసొలేషన్ వార్డుకు తరలించారు. రెడ్ జోన్ నుంచి రావడం, పైగా కరోనా లక్షణాలు కూడా ఉండడంతో.. ఇతడికి కచ్చితంగా పాజిటివ్ వస్తుందని రాజాం ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. దీంతో… శ్రీకాకుళంలో తొలి కరోనా కేసు నమోదయ్యే ప్రమాదం పొంచి ఉందనే అనుకోవాలి!!

రాష్ట్రాలకు రాష్ట్రాలు దాటి వలసకూలీలుగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న లక్షల మంది జనాలు ఎంతో సహనంగా ఉంటున్న ఈ దశలో ఒకే రాష్ట్రంలో ఉంటూ కూడా ఇలాంటి వారు తొందరపాటు నిర్ణయాలు, అజ్ఞానంతో కూడిన ఆలోచనలు చేయకుండా ఇంకాస్త ఓపికగా ఉండాలని అంతా కోరుకుంటున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news