తెలంగాణాలో కరోనా వైరస్ తీవ్రంగా ఉన్న నేపధ్యంలో రాష్ట్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పెంచాలి అని నిర్ణయం తీసుకుంది. ఆదివారం మీడియా తో మాట్లాడిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై కీలక ప్రకటన చేసారు. లాక్ డౌన్ ని మే 7 వరకు పెంచుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఆ తర్వాత పరిస్థితిపై మే 5 న కేబినేట్ సమావేశం నిర్వహించి… అప్పుడు నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఆయన.
తెలంగాణలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తు కూడా ఆ రోజే తెలిసే అవకాశం ఉందని అన్నారు. తెలంగాణలో లాక్ డౌన్ కారణంగా పదో తరగతి పరీక్షలు మధ్యలో ఆపేశారు. విద్యాసంవత్సరం పొడిగింపుతో పాటుగా పదో తరగతి పరీక్షలపై మే 5న తెలంగాణ కేబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక విద్యార్ధులకు సంబంధించి మరికొన్ని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది దసరా, సంక్రాంతి సెలవలను పూర్తిగా రద్దు చేయడం తో పాటుగా పరీక్షలను ఏప్రిల్ రెండో వారం నుంచి వచ్చే ఏడాది నిర్వహిస్తారని సమాచారం. ఇక సెలవలను ఏ మాత్రం ఒక రోజుకి మించి అది కూడా అత్యవసరం అయితే మినహా ఇచ్చే పరిస్థితి లేదని భావిస్తున్నారు. కేసీఆర్ కూడా ఇదే విషయాన్ని చెప్పే అవకాశం ఉందని అంటున్నారు. దీనిపై మే 5 న స్పష్టత వస్తుంది.