దశమహావిద్యలు.. సాక్షాత్తు ఆదిపరాశక్తి అంశలతో ఆయా రూపాలతో అమ్మ పూజ మంత్ర, తంత్ర విశేషాలను మహావిద్యలుగా పరిగణిస్తారు. ఆ ఆదిశక్తికి సంబంధించిన పది విద్యలు విశేష ప్రాచుర్యం పొందాయి. వాటిలో మొదటి ఐదింటి గురించి తెలుసుకుందాం…
మొదటిరూపం కాళి : మహాకాళి సమస్త విద్యలకు ఆది. ఆమె విద్యామయ విభూతలనే మహావిద్యలంటారు. ఒకానొక సమయంలో హిమాలయములందు కల మతంగ మున్యాశ్రమమునందు దేవతలు మహామాయను స్తుతించిరి. అంబిక మతాంగ వనితా రూపమున దర్శనమిచ్చింది. కాటుక వలె కృష్ణవర్ణమునందు ఉండుటవలన ఆమెకు కాళీ అనే పేరు వచ్చింది. శుంభనిశుంభలను సంహరించినది. కాళి నీలరూపము అగుటవలన తారానామము ఏర్పడినది. అనేక సంవత్సరాల కాలమునకు కాని ఫలించని యోగమార్గ సాధన, కొద్ది రోజులలోనో, మాసములలోనో సాధించాలి అని అనుకొనే వారు కాళి ఉపాసన చేస్తారు. ఐతే సాధనాకలం లో కాళీ శక్తి తమ శరీరములోకి ఆకర్షించినపుడు యోగి దుర్భరమైన అగ్ని సదృశమైన మంటలను, బాధలను అనుభవించాల్సి ఉండును.
రెండువరూపం తార : తార సర్వదా మోక్షమును ప్రసాదించును. ఈమెకు నీలసరస్వతి అను పేరు కూడా ఉంది. భయంకరమైన విపత్తులనుండి భక్తులను కాపాడుతుంది కావున, ఈమెను ఉగ్రతార రూపమున కూడ యోగులు ఆరాధిస్తారు. వశిష్ఠ మహర్షి గొప్ప తారా ఉపాసకుడు. చైత్రశుద్ధ నవమి రాత్రిని తారారాత్రి అని పిలుస్తారు. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మూడవరూపం ఛిన్నమస్త : దేవి ఒకానొక సమయమున తన సఖురాండ్రైన జయవిజయలతో మందాకిని నదికి స్నానార్ధము వెల్లింది. స్నానము చేసిన తదుపరి ఆమె క్షుధాగ్ని పీడితయై కృష్ణవర్ణ ఐనది. ఆమె సఖురాండ్రు ఆమెను భోజనవిషయమై అడిగిరి. కృపామయురాలు అయిన దేవి ఖడ్గముతో తన శిరస్సును ఖండించుకొనగా ఖండిత శిరస్సు ఆమె వామ హస్తమున పడింది. ఆమె కబంధం నుండి మూడు రక్తధారలు ప్రవహించినవి. రెండు రక్తధారలను ఆమె సఖురాండ్రు పానము చేయగా మూడవ రక్తధారను దేవియే స్వయముగా పానము చేసినది. ఆ రోజునుండి ఆమెకు ఛిన్నమస్తా నామము స్థిరపడినది. హిరణ్యకశ్యపాదులు ఈ ఛినమస్తాదేవి ఉపాసకులు.
నాల్గవరూపం షోడసీ : ఈ తల్లి చాలా దయామయురాలు. ఈమెను ఆశ్రయించినవారికి ఙ్ఞానమనునది కరతలామలకము. విశ్వములోని మంత్రతంత్రాదులన్ని ఈ అమ్మవారినే ఆరాధిస్తాయి. ఈమెను వేదములు కూడ వర్ణింపజాలవు. ప్రసన్నురాలైన ఈ మహాశక్తి ఉపాసన వలన భోగమోక్షములు రెందూ సిద్ధిస్తాయి. బుధగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఐదవరూపం భువనేశ్వరీదేవి : సమస్తకోటి మహామంత్రములు ఎల్లపుడు ఈ దేవిని ఆరాధిస్తూ ఉంటాయి. కాళీతత్వము నుండి నిర్గతమై కమలాతత్వ పర్యంతం దశస్థితులు ఉన్నయి. వాటినుండి అవ్యక్త భువనేశ్వరీ వ్యక్తమై బ్రహ్మాండరూపాన్ని ధరించకలుగుతుంది. ప్రళయవేళలో జగత్తునుండి క్రమముగా లయమై కాళీరూపములో మూలప్రకృతిగా మారుతుంది. అందుచేతనే ఈ తల్లిని కాలుని జన్మదాత్రి అని కూడా అంటారు. చంద్రగ్రహ దోషం ఉన్నవారు కి ఈ అమ్మవారి ని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది.
– శ్రీ