ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను ఆదివారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కూల్చివేత ప్రక్రియ మరో ఐదు రోజులు పట్టే అవకాశం ఉందని వెల్లడించారు. కూల్చివేత పూర్తి అయ్యే వరకు పరిసర ప్రాంత ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెప్పారు.
దెబ్బతిన్న భవనం సమీప బస్తీ వాసులకు అండగా ఉంటామని.. వారి ఇళ్లకు ఏమైనా డ్యామేజ్ జరిగితే ప్రభుత్వమే బాధ్యత తీసుకుంటుందని తెలిపారు. నగరంలో అనుమతి లేని భవనాలు, జనావాసాల మధ్య ఉన్న గోదాముల విషయంలో తగిన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భవన యాజమానులకు అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.