ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, ఇన్సూరెన్స్ కంపెనీ బజాజ్ అలియాంజ్‌లు కలిసి వినియోగదారులకు తక్కువ ప్రీమియంలకే ఆన్‌లైన్ ఫ్రాడ్ ఇన్సూరెన్స్ పాలసీలను అందిస్తున్నాయి. డిజిటల్ సురక్ష గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీల్లో భాగంగా వాటిని ఆయా సంస్థలు అందిస్తున్నాయి. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో మొబైల్స్, ల్యాప్‌టాప్స్, ట్యాబ్లెట్స్, ఆడియో డివైస్‌లు తదితర వస్తువులను కొనుగోలు చేస్తే ఈ ఇన్సూరెన్స్ పాలసీలను తీసుకోవచ్చు.
ఆయా సంస్థలు అందిస్తున్న సదరు పాలసీల వల్ల వినియోగదారులు సైబర్ మోసాలకు గురైతే వాటి వల్ల ఏమైనా డబ్బును నష్టపోతే ఆ మొత్తాన్ని సదరు ఇన్సూరెన్స్‌తో క్లెయిమ్ చేసుకోవచ్చు. ఫ్రాడ్ జరిగిన తేదీ నుంచి 90 రోజుల్లోగా వినియోగదారులు ఫిర్యాదు చేసి సదరు ఫ్రాడ్‌కు చెందిన నష్టం మొత్తాన్ని ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవచ్చు. యూపీఐ, వాలెట్లు, నెట్ బ్యాంకింగ్, డెబిట్, క్రెడిట్ కార్డులు, సైబర్ అటాక్స్, ఫిషింగ్, స్పూఫింగ్, సిమ్ జాకింగ్ తదితర ఏ విధంగానైనా సరే వినియోగదారులు సైబర్ మోసానికి గురైతే ఆయా ఇన్సూరెన్స్ పాలసీలతో ఆ మోసం వల్ల కలిగిన నష్టాన్ని భర్తీ చేసుకోవచ్చు. ఇన్సూరెన్స్‌ను క్లెయిమ్ చేసుకుంటే ఆ నష్టాన్ని కవర్ చేయవచ్చు.
కాగా వినియోగదారులు తమకు కావల్సిన కవరేజీకి గాను నిర్దిష్టమైన మొత్తంలో ప్రీమియం చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌లో పాలసీలను పొందవచ్చు. రూ.183 ప్రీమియంతో రూ.50వేల కవరేజీ లభిస్తుంది. అదే రూ.312కు రూ.1 లక్ష వరకు కవరేజ్ వస్తుంది. రూ.561కు రూ.2 లక్షలు కవరేజ్ ఇస్తారు. ఇక 12 నెలల కాలవ్యవధితో రూ.10 లక్షల వరకు కవరేజ్ ఇచ్చే పాలసీలను కూడా తీసుకోవచ్చు. డిజిటల్ సురక్ష గ్రూప్ ఇన్సూరెన్స్ లో భాగంగా ఈ పాలసీలను వినియోగదారులు సైబర్ మోసాల నుంచి రక్షణ కోసం తీసుకోవచ్చు.