ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దీంతో వరదలు బీభత్సం సృష్టించాయి. అయితే ప్రస్తుతం వరదలు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. వరదల కారణంగా భూమిలో పూడ్చిపెట్టిన మృతదేహాలు బయట పడుతున్నాయి. ఈ ఘటన తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలో చోటు చేసుకుంది. ఏటిగట్టు పరిసర గ్రామాల్లోని ప్రజలకు శ్మశాన వాటికలు కరువయ్యాయి. దీంతో అంత్యక్రియలకు గోదావరి లంక దిబ్బలపైనే మృతదేహాలను పూడ్చి పెట్టారు.

గోదావరి వరదలకు మట్టి కొట్టుకుపోవడంతో పూడ్చి పెట్టిన మృతదేహాలు బయట పెడుతున్నాయి. దీంతో పురుషోత్తపట్నం, రామచంద్రపురం గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అయితే 2003లో పడవ మునిగి రామచంద్రపురం గ్రామానికి చెందిన 20 మంది వ్యక్తులు మృతి చెందారు. దీంతో వారిని గోదావరి ఒడ్డున ఒకే గోతిలో పూడ్చి పెట్టారు. భారీ వర్షాల కారణంగా గోదావరి వరదలకు మట్టి కొట్టుకుపోవడంతో మృతదేహాలు బయటపడ్డాయి.