హైదరాబాద్ వాసులతో పాటు దేశమంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. నేటి నుంచి నగరంలో ఫార్ములా ఈ-రేసింగ్ ప్రారంభం అవుతోంది. ఇవాళ ప్రాక్టీస్ మ్యాచ్ తో ఈ రేసంగ్ షురూ కాబోతోంది. ఇప్పటి వరకు విదేశాల్లో మాత్రమే జరిగిన ఈ రేసింగ్ తొలిసారిగా భారత్ లో జరుగుతోంది. దీనికి హైదరాబాద్ వేదిక కావడం తెలంగాణకే గర్వకారణమని ఇప్పటికే పలువురు రాజకీయ నేతలతో పాటు సినీ ప్రముఖులు కూడా హర్షం వ్యక్తం చేశారు.
హుస్సేన్‌సాగర్ తీరాన జరిగే అంతర్జాతీయ పోటీల కోసం 2.8 కిలోమీటర్ల స్ట్రీట్ సర్క్యూట్‌ను తీర్చిదిద్దారు. లుంబినిపార్కు నుంచి ప్రారంభమై సచివాలయం పక్క నుంచి మింట్ కాంపౌండ్, ఐమాక్స్ మీదుగా ఎన్టీఆర్ గార్డెన్ వరకు రేస్ సాగనుంది. మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తాచాటనున్నారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 4.30 గంటలకు తొలి ప్రాక్టీస్ రేస్ జరుగుతుంది. రేపు ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు రెండో ప్రీ ప్రాక్టీస్ రేస్, ఉదయం 10 గంటల 40 నిమిషాలకు అర్హత పోటీలు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్ ఉంటుంది.