స్కూల్‌ వ్యాన్‌లో మంటలు.. నలుగురు చిన్నారులు సజీవ దహనం

-

వాళ్లంతా ఎల్‌కేజీ, యూకేజీ చదివే పిల్లలు. పొద్దంతా స్కూల్లో టీచర్లు, స్నేహితులతో సంతోషంగా గడిపారు. సాయంత్రం స్కూల్‌ నుంచి విడిచిపెట్టగానే ఇంటికివెళ్లే సంతోషంలో పరుగెత్తుకుంటూ స్కూల్‌ వ్యాన్‌లోకి ఎక్కారు. వ్యాన్‌ స్కూల్‌ నుంచి బయలుదేరింది. పిల్లల అల్లరితో వ్యాన్‌లో సందడిసందడిగా ఉంది. కానీ ఇంతలోనే విధి వెక్కిరించింది. వ్యాన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. నలుగురు పసిబిడ్డలు వ్యాన్‌లోనే కాలి బూడిదయ్యారు. మిగితావారికి గాయాలయ్యాయి. పంజాబ్‌ రాష్ట్రం సంగ్రూర్‌ పట్టణంలో శనివారం జరిగింది ఈ ఘటన.

ప్రమాదం జరిగినప్పుడు వ్యాన్‌లో మొత్తం 12 మంది చిన్నారులున్నారు. మంటలు చెలరేగగానే చిన్నారుల అరుపులు, కేకలు విని, రోడ్డుపక్కనే పొలాల్లో పనిచేస్తున్న కూలీలు పరుగెత్తుకొచ్చారు. వ్యాన్‌ అద్దాలు పగులగొట్టి 8 మంది చిన్నారులను రక్షించారు. కానీ అప్పటికే మంటలు మరింత ఎక్కువ కావడంతో మిగతా నలుగురు చిన్నారులు వ్యాన్‌లోనే సజీవదహనమయ్యారు. ప్రాణాలతో బయటపడ్డ చిన్నారులకు కూడా కాలిన గాయాలు కావడంతో స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

ఈ ప్రమాదం గురించి తెలియగానే జిల్లా కలెక్టర్‌, ఎస్పీ ఘటనా స్థలానికి చేరుకున్నారు. పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. మరోవైపు పంజాబ్‌ సీఎం అమరీందర్‌ సింగ్‌ ఘటన గురించి తెలిసి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. బాధ్యులను కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఇదిలావుంటే తాము ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటున్న తమబిడ్డలు ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేక.. వారి తల్లిదండ్రులు రోదించిన తీరు చూపరులను కలచివేసింది.

Read more RELATED
Recommended to you

Latest news