గ్రేటర్‌ ఫలితాల పై టెన్షన్ పడుతున్న ఆ నలుగురు మంత్రులు

-

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల ఫలితాలు వెల్లడైన నాటి నుంచి కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలకు టెన్షన్‌ పట్టుకుందట. తాము ఇంఛార్జులుగా ఉన్న డివిజన్లలో పార్టీ ఓటమే ఈ ఆందోళనకు కారణమని చెబుతున్నారు. మరి.. వారు భయపడినట్టే అవుతుందా ఇప్పుడు ఈ విషయం పై ఇటు పార్టీలోను అటు ప్రభుత్వ వర్గాల్లోను ఆసక్తికర చర్చ నడుస్తుంది.

దుబ్బాక ఓటమి తర్వాత నిర్వహించిన గ్రేటర్ ఎన్నికల్లో కొత్త రణనీతిని అనుసరించింది అధికార టీఆర్‌ఎస్‌. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ ప్రధాన కార్యదర్శులను డివిజన్లకు ఇంఛార్జులుగా నియమించింది. ఒక్కో మంత్రికి ఒక్కో డివిజన్‌ కేటాయించారు. ఆయా డివిజన్లలో టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం సర్వ శక్తులు ఒడ్డారు మంత్రులు. తమ ప్రాంతాల నుంచి సొంత టీమ్‌ను దించారు. అయినా కొందరు మంత్రులు, నాయకులకు ఆయా డివిజన్లు మింగుడు పడలేదు.

పోలింగ్‌ ముందు రోజు వరకు ఆయా డివిజన్లలో ఉండి టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల కోసం అనేక వ్యూహాలు రచించారు మంత్రులు. ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని అడిక్‌మెట్‌ డివిజన్‌ను మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు అప్పగించింది పార్టీ. ఆ డివిజన్‌లో అసంతృప్తులను బుజ్జగించడంలో సక్సెస్‌ కావడంతో అంతా అనుకూలంగానే ఉంటుందని మంత్రి భావించారు. కానీ.. అడిక్‌మెట్‌లో బీజేపీ అభ్యర్థి గెలవడంతో శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు అధికార పార్టీ నాయకులు కంగుతిన్నారు.

మరో మంత్రి జగదీష్‌రెడ్డికి సరూర్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతలు అప్పగించారు. అప్పటి నుంచి పోలింగ్‌ ముందు రోజు వరకు సరూర్‌నగర్‌లోనే మకాం వేసుకుని పగలు రాత్రి ప్రచారం చేశారు. పార్టీ అభ్యర్థిని గెలిపించేందుకు అందరినీ సమన్వయ పరిచారు. కానీ.. ఈ డివిజన్‌లో మంత్రి పాచికలు పారలేదు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఓడి.. బీజేపీ క్యాండిడేట్‌ గెలిచారు.

మల్కాజ్‌గిరి డివిజన్‌ ఇంఛార్జ్‌గా మంత్రి ఈటల రాజేందర్‌కు బాధ్యతలు అప్పగించింది టీఆర్‌ఎస్‌. ఆయన కూడా తన నియోజకవర్గం నుంచి అనుచరులను దించారు. హోరాహోరీ పోరులో ఇక్కడ బీజేపీ గెలిచింది. అలాగే హిమాయత్‌నగర్‌ డివిజన్‌ బాధ్యతలను మంత్రి గంగుల కమలాకర్‌కు ఇచ్చారు టీఆర్‌ఎస్‌ పెద్దలు. పార్టీ అభ్యర్థి కంటే ముందుగానే ప్రతిరోజు రోడ్డెక్కి ప్రచారం చేశారు కమలాకర్‌. కానీ.. ఇక్కడ సిట్టింగ్‌ కార్పొరేటర్‌ ఓడి.. బీజేపీ అభ్యర్థి గెలిచారు. వాస్తవానికి కమలాకర్‌కు తొలుత జూబ్లీహిల్స్‌ డివిజన్ అప్పగించారు. కానీ.. పార్టీతో మాట్లాడి హిమాయత్‌నగర్‌కు మార్చుకున్నారు. అయినా మార్పు కలిసి రాలేదు.

డివిజన్లకు ఇంఛార్జ్‌లుగా ఉన్న చోట 9 మంది మంత్రులు సక్సెస్‌ అయితే.. నలుగురు మాత్రం పార్టీని విజయతీరాలకు చేర్చలేకపోయారు. దీంతో వారి రాజకీయ భవిష్యత్‌పై పార్టీలో రకరకాలుగా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చి రెండేళ్లు అయింది. కేబినెట్‌లో మార్పులు చేర్పులు ఉంటాయని అనుకుంటున్నారు. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల ఫలితాలను ప్రామాణికంగా తీసుకుని నిర్ణయం చేపడితే మాత్రం ఇబ్బంది తప్పదనే కామెంట్స్‌ వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఇలాంటి తరుణంలో పార్టీలోనూ.. ప్రభుత్వంలోను మార్పులు చేర్పులు చేయాలని సీఎం కేసీఆర్‌ భావిస్తే కొందరి రాజకీయ భవిష్యత్‌ ఏంటన్న చర్చ జరుగుతోంది. అందుకే గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపుకోసం పనిచేసి…ఫలితాల తర్వాత కంగుతిన్న నాయకుల్లో టెన్షన్‌ మొదలైందని సమాచారం. మరి ఏం జరుగుతుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news