నేటితో ‘వివేకా హత్య’కు నాలుగేళ్లు.. పులివెందులలో ఇవాళ వర్ధంతి

-

తెలుగు రాష్ట్రాల్లో మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఆయన హత్యకు గురై నాలుగేళ్లు గడిచినా ఇప్పటి వరకు నిందితులెవరో స్పష్టంగా తేలలేదు. వారికి శిక్షపడలేదు. ఈ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ.. దర్యాప్తు సంస్థలు మారుతూ.. రాష్ట్రాలకు బదిలీ అవుతూ ఎట్టకేలకు తెలంగాణకు చేరింది. తెలంగాణలో సీబీఐ అధికారులు వివేకా హత్య కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు.

2019 మార్చి 14వ తేదీ అర్ధరాత్రి తర్వాత పులివెందులలోని సొంత ఇంట్లోనే వైఎస్​ వివేకానందరెడ్డి దారుణహత్యకు గురయ్యారు. మరుసటి రోజు అనగా మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల 15నిమిషాలకు వివేకా పీఏ కృష్ణారెడ్డి ద్వారా హత్య జరిగిన విషయం బయటి ప్రపంచానికి తెలిసింది. ఉదయం 6 గంటల 29 నిమిషాలకు కడప ఎంపీ వైఎస్​ అవినాష్‌రెడ్డి, వైఎస్​ భాస్కర్‌రెడ్డి, వైఎస్​ మనోహర్‌రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి, ఎర్ర గంగిరెడ్డితోపాటు పలువురు వైఎస్సార్​సీపీ నాయకులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

గుండెపోటుతో వివేకా చనిపోయారని తొలుత ప్రచారం జరిగింది. అందుకే మృతదేహానికి కుట్లు వేసి, బ్యాండేజ్ చుట్టి, ఇంట్లోని రక్తపు మరకలు తుడిచేశారని.. ఈ వ్యవహారంలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి కీలక పాత్ర పోషించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ త్వరలోనే నిందితులెవరో తేల్చనుంది.

Read more RELATED
Recommended to you

Latest news