ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉంటున్నప్పటికీ మోసగాళ్లు కొత్త కొత్త పద్ధతుల్లో జనాలను మోసం చేస్తూనే వస్తున్నారు. ఆదమరిచి ఉంటే డబ్బును అమాంతం దోపిడీ చేస్తున్నారు. డబ్బును దోచుకోకపోయినా మన విలువైన వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేసి దాంతో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. హ్యాకర్లకు మన సమాచారాన్ని అమ్ముకుంటున్నారు. దీంతో ఎటు తిరిగి మనం నష్టపోతున్నాం. ఇక మోసగాళ్లు ఇటీవలి కాలంలో మోసాలు చేసేందుకు నయా ట్రెండ్‌ను అనుసరిస్తున్నారు. నూతన మార్గాలలో ముందుకు సాగుతున్నారు. అలాంటి వాటిలో ఒకటి.. సిమ్ బాక్స్.. ఇంతకీ అసలు సిమ్ బాక్స్ అంటే ఏమిటి ? అంటే..
భిన్న టెలికాం ఆపరేటర్లకు చెందిన కొన్ని సిమ్ కార్డులను అన్నింటినీ ఒకే బాక్స్‌లో వేసి పలు గేట్ వేలను ఉపయోగిస్తూ ప్రజలకు కాల్స్ చేస్తుంటారు. మోసగాళ్లు చేసేది ఇంటర్నేషనల్ కాల్స్ అయినప్పటికీ అవి లోకల్ కాల్స్ మాదిరిగా ప్రజలకు కనిపిస్తాయి. ఇక ఆ సిమ్ బాక్స్‌లను ట్రాక్ చేయడం కష్టమే. ఎందుకంటే భిన్న రకాల గేట్ వేలను ఉపయోగిస్తారు కనుక వారి లొకేషన్ ఎక్కడ అనేది సరిగ్గా తెలియదు. ఇదే వారికి ప్లస్ పాయింట్ అయింది. ఈ క్రమంలోనే సిమ్ బాక్స్‌లను ఉపయోగించి అనేక మోసాలకు పాల్పడుతున్నారు.
ఇటీవలే బెంగళూరులోని బీటీఎం లే అవుట్ అనే ప్రదేశంలో ఇద్దరు వ్యక్తులు సిమ్ బాక్స్‌తో పశ్చిమ బెంగాల్‌లోని ఇండియన్ ఆర్మీ హెల్ప్ లైన్ నంబర్‌లకు ఫోన్ కాల్స్ చేశారు. పశ్చిమ బెంగాల్ లో ఉన్న ఆర్మీ అధికారులు, సిబ్బంది ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలుసుకునేందుకు వారు సిమ్ బాక్స్‌ను ఉపయోగించారు. దీంతో ఈ విషయం సంచలనం సృష్టిస్తోంది.
సిమ్ బాక్స్‌లలో పలు రకాల మోడల్స్ ఉంటాయి. కొన్నింటిలో ఎక్కువ సిమ్‌లను వేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే వీటికి హై స్పీడ్ ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. కానీ సిమ్ బాక్స్‌లను ఉపయోగించి భారత ఆర్మీపై దాడి మొదలు పెట్టారంటే పరిస్థితి ఎంత వరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. ఇది మన దేశ భద్రతకే సవాల్‌గా మారింది. ఈ క్రమంలోనే ఇలాంటి సిమ్ బాక్స్‌లను ఇంకా ఎవరెవరు ఉపయోగిస్తున్నారు ? అనే కోణంలో పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.