టీవీ రిమోట్ పట్టుకున్నామంటే చాలు.. అందులో ఉన్న చానెల్స్ అన్నీ ఓసారి అలా నొక్కి చివరకు ఏదో ఒక చానెల్ కు ఫిక్స్ అయిపోతుంటాం. కానీ.. వచ్చే అన్ని చానెళ్లను చూస్తామా? చూడం. పోనీ.. చూడనప్పుడు అవన్నీ ఎందుకు అంటే.. అదంతే అలా ప్యాక్ తో పాటు వస్తాయి కాబట్టి.. వాటిని ఏం చేయలేం.. అంతే కదా.
కానీ.. ఈనెల 29 నుంచి మీకు నచ్చని చానెల్ మీ టీవీలో రాదు. అవును.. మీరు కావాలనుకున్న చానెలే.. మీకు నచ్చిన చానెలో వస్తుంది. టీవీ ప్రేక్షకులు ఏ చానెల్ చూడాలనుకుంటే ఆ చానెల్ కే డబ్బులు కట్టాలి… ఈ విధానమే 29 నుంచి వచ్చేది. భారత టెలికాం నియంత్రణ ప్రాధికార సంస్థ.. ట్రాయ్ ఉంది కదా. ఆ ట్రాయే కొత్త పద్ధతిని తీసుకొచ్చింది.
ఈనెల 29 నుంచి మీ టీవీలో చానెళ్లు రావాలంటే మీరు 130 రూపాయలు కట్టాలి. అది బేసిక్ ప్యాక్. టాక్సులు అదనంగా ఉంటాయి. బేసిక్ ప్యాక్ తో పాటు మీకు 100 చానెళ్లు ఉచితంగా ఇస్తారు. ఇందులో ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్ ఉండవు. కొన్ని ఆధ్యాత్మిక, న్యూస్ చానెళ్లు ఉంటాయి. 100 చానెళ్లలో అన్ని బాషల చానెళ్లు ఉన్నాయి.
ఇవి కాకుండా.. మీకు ఎంటర్ టైన్ మెంట్ చానెల్స్, ఇతర చానెల్స్ కావాలనుకుంటే.. అప్పుడు మీకు నచ్చిన చానెల్ కు సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో చానెల్ కు ఒక్కో ధర ఉంటుంది. ఏ చానెల్ కు ఎంత రేట్ ఉంది అని తెలుసుకోవాలనుకుంటే.. ట్రాయ్ అనే వెబ్ సైట్ లో వెళ్లి తెలుసుకోవచ్చు.