కేంద్ర న్యాయ శాఖ మంత్రి సుప్రీం కోర్టు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శబరిమల కేసులో త్వరగా తీర్పు వచ్చినప్పుడు ఎన్నో ఏళ్లుగా అయోధ్య కేసును ఎందుకు పెండింగ్‌లో ఉంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. సోమవారం లక్నోలో ఆయన అఖిల భారతీయ ఆధివక్త పరిషద్ 15వ జాతీయ సదస్సును ప్రారంభం సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజల మనోభావాలతో కూడుకున్న రామ జన్మభూమి అంశాన్ని ఏడు దశాబ్దాలుగా ఎందుకు నాన్చుతున్నారని సుప్రీంకోర్టును ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి కేసును త్వరితగతిన పూర్తి చేయాలని తన వ్యక్తిగత అభిప్రాయమన్నారు. భారత సర్వోన్నత న్యాయస్థానం రామ జన్మభూమి – బాబ్రి మసీద్ వివాద కేసును జనవరి 4న విచారించనున్న నేపథ్యంలో సాక్షాత్తు న్యాయశాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ ఎస్‌కే కౌల్‌తో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారిస్తోంది. బాబర్‌ను మనమెందుకు ఆరాధించాలని ప్రశ్నించారు. భారత రాజ్యాంగాన్ని ఉదహరిస్తూ ‘రాముడు, కృష్ణుడు, అక్బర్ ప్రస్తావన ఉంది. రాజ్యాంగంలో అసలు బాబర్ ప్రస్తావనే లేదు..అంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరో సారి సెంటిమెంట్ అంశాన్ని భాజపా తెరపైకి తెస్తున్నట్లు ఉందని పలువురు చర్చించుకుంటున్నారు.