కరోనా ఎంతో మంది జీవితాలను తలకిందులు చేసింది. చాలా మందిని నడిరోడ్డుమీద పడేసింది. ఇంకొందరి ఉపాధిని లాగేసుకుంది. అలా కొవిడ్ సమయంలో ఉద్యోగం కోల్పోయిన ఓ మహిళ తనకు తెలిసిన పనినే ఉపాధిగా మార్చుకుంది. ఇప్పుడు చాలా మందికి తానే ఉపాధి కల్పిస్తూ ఓ వ్యాపారవేత్తగా ఎదిగింది. కరోనా మిగిల్చిన నష్టాల నుంచి త్వరగా బయటపడి ఇప్పుడు లాభాల్లో నడిచే వ్యాపారాణికి తానే క్వీన్ అయింది. ఇంతకీ ఈ వంటలక్క ఎవరో.. తన స్టోరీ ఏంటో చదివేద్దామా..?
కరోనా ముందు వరకు 47 ఏళ్ల రాజీశక్తి ఓ ప్రైవేట్ ఇన్ స్టిట్యూట్ లో సాధారణ ఎడ్యుకేషనల్ కౌన్సెలర్. లాక్ డౌన్ లో చాలా మందితోపాటు రాజీ ఉద్యోగం కూడా పోయింది. ఇంట్లో ఉండే అలవాటు లేకపోవడం.. ఆర్థిక ఇబ్బందులతో కుటుంబం కొట్టుమిట్టాడటం చూసిన రాజీకి వెంటనే ఓ ఆలోచన వచ్చింది. అవసరం నుంచే ఆలోచన పుడుతుంది అన్నట్లుగా రాజీకి తనకు బాగా వచ్చిన, నచ్చిన పనినే వ్యాపారంగా మలుచుకోవాలన్న అద్భుతమైన ఆలోచన వచ్చింది. అదేంటంటే.. తనకు తెలిసిన వంటను అందరికీ పరిచయం చేయడం. ఇప్పటి వరకు తన ఇంట్లో వాళ్లు, బంధువులు, స్నేహితులు మాత్రమే రుచి చూసిన తన వంటకాలను ప్రపంచం టేస్ట్ చేసేలా చేయడం. ఐడియా వచ్చింది కానీ తర్వాత ఏం చేయాలి..?
‘నా దగ్గరున్న కొద్దిపాటి బంగారాన్ని తాకట్టు పెట్టి రూ.20వేలు రుణం తీసుకొని క్లౌడ్‌కిచెన్ ప్రారంభించా. ప్రత్యేక యూనిట్ కాకుండా ఇంటి నుంచే వంటలు చేసి వినియోగదారులకు అందించాలనుకున్నా. దీనికి ‘ఫ్రమ్ ది కిచెన్- హోమ్లీ ఫుడ్స్’ పేరుతో స్విగ్గీలో రిజిష్టరు చేయించా. ఆరేడునెలలపాటు ఆర్డర్లు పెద్దగా రాలేదు. లాభాలమాట అటుంచి, పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. అయినా నిరుత్సాహపడలేదు. మావారు, పిల్లలు ప్రోత్సహించేవారు. ఓపిగ్గా ఆర్డర్ల కోసం ఎదురుచూశా. అలా ఒకరిద్దరి నుంచి రావడం మొదలై, క్రమేపీ ఆ సంఖ్య పెరిగింది. అలా మా వద్ద ఆహారాన్ని రుచి చూసిన తర్వాత మంచి రేటింగ్ ఇవ్వడమే కాదు, వారి స్నేహితులు, బంధువులకూ చెప్పేవారు. మేం అందించే దక్షిణాది వంటకాలు చాలామందికి నచ్చేవి. దాంతో జొమాటోలోనూ రిజిష్టరయ్యా. దాంతోపాటు ఆన్‌లైన్‌లో మార్కెటింగ్ ప్రారంభించా.
‘హోమ్లీ ఫుడ్స్ అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ అలూవా’ పేరుతో క్లౌడ్ కిచెన్ ద్వారా అందించే వంటకాల వివరాలను అందరికీ తెలిసేలా చేశామని రాజీ చెబుతోంది. ఈ తరహా మార్కెటింగ్ మా గురించి అందరికీ చేరేలా చేశానని తెలిపింది. అల్పాహారం, లంచ్‌కు సంబంధించి శాకాహార, మాంసాహార వంటకాలతోపాటు కాఫీ,టీ, పండ్లరసాలు అందిస్తున్నామని అంటోంది. ఆర్డర్లు పెరిగాయని.. ఉదయం ఏడుగంటలకే ఆర్డర్ల హడావుడి మొదలవుతుందని ఆనందంగా చెబుతోంది. అరగంటలోపు వినియోగదారుడికి వంటకాలు అందించడం’ తమ స్పెషాలిటీ అంటోంది రాజీ.
నెయ్యి వేసిన మినీ ఇడ్లీలు, సాంబారు, పుట్టుతో శనగల కూర, ఆపం, కోడిగుడ్డు కూర వంటివన్నీ రాజీ క్లౌడ్ కిచెన్‌లో ప్రత్యేకం. చేపలకూర నుంచి శాండ్‌విచ్, బర్గర్, బ్రెడ్‌ఆమ్లెట్స్, మొహిటోస్ వంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి. ‘వంటల్లో కొత్తగా ప్రయోగాలు చేసి.. పిల్లలకు వడ్డించడం నా అలవాటు. ఆ అభిరుచే నన్నీరోజు ఆర్థికంగా నిలబెట్టింది. మహిళలు తమకు తెలిసిన రంగంలో అడుగుపెట్టి తమకాళ్లపై తాము నిలబడగలిగితే చాలు. అదే ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అందరిలోనూ గౌరవాన్ని అందిస్తుంది’ అని అంటోన్న రాజీ ఎంతో మందికి ఇన్సిపిరేషన్.