కరోనా మిగిల్చిన నష్టం నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు నెమ్మదిగా కోలుకుంటున్నాయి. అనేక దేశాల్లో ఇప్పటికే కోవిడ్ వ్యాక్సిన్‌ను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. అయితే కరోనా భయం ఇంకా పూర్తిగా పోకముందే సైంటిస్టులు మరో షాకింగ్ విషయం చెప్పారు. కోవిడ్ కన్నా అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ ఎప్పుడైనా వ్యాప్తి చెందే అవకాశం ఉందని వెల్లడించారు.
అమెరికాలోని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) సైంటిస్టులు అత్యంత ప్రమాదకరమైన ఫంగస్ గురించి తాజాగా వివరాలను వెల్లడించారు. కాండిడా ఆరిస్ అనే పేరున్న ఆ ఫంగస్ అనేక రకాల ఉపరితలాలపై అత్యంత సుదీర్ఘకాలం పాటు బతికి ఉంటుందని చెప్పారు. 2009లోనే ఈ ఫంగస్ ను గుర్తించారు. అయితే ఈ ఫంగస్ ఎప్పుడైనా కరోనా వైరస్‌లా వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
సదరు ఫంగస్ మనిషి శరీరంలో రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తే అప్పులు తీవ్ర ప్రాణాంతక పరిస్థితులు ఏర్పడుతాయని సైంటిస్టులు తెలిపారు. దీంతో వ్యక్తి ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని తెలిపారు. అయితే ఈ ఫంగస్ ఎప్పుడు ఎలా వ్యాప్తి చెందుతుందో చెప్పలేమని, కనుక భవిష్యత్తులో ఫంగస్, వైరస్, బాక్టీరియా.. ఇలా దేని ద్వారా మహమ్మారి వ్యాధులు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని సైంటిస్టులు సూచించారు.