విశాఖపట్నం నగరానికి అరుదైన గౌరవం దక్కింది. జి-20 సదస్సుకు విశాఖపట్నం వేదిక కానుంది. జి-20 అధ్యక్ష దేశంగా భారత్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో, ఈ ఏడాది డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది నవంబర్ వరకు సదస్సులు, వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా దేశంలోని 56 నగరాలు, పట్టణాల్లో వివిధ అంశాలకు సంబంధించి 200 సదస్సులు నిర్వహించబోతోంది. ఏపీ నుంచి విశాఖపట్నం ని కేంద్రం ఎంపిక చేసింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 3, 4 తేదీల్లో ఏప్రిల్ 24న విశాఖ వేదికగా వివిధ అంశాలపై సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది. ఇప్పటికే రాష్ట్రంలో నిర్వహించే జి-20 సదస్సుకు నోడల్ అధికారిగా ప్రోటోకాల్ డైరెక్టర్ ఎం.బాలసుబ్రమణ్యం రెడ్డిని, సెక్యూరిటీ నోడల్ అధికారిగా డీజీపీని నియమించారు. విశాఖలో సదస్సు జరిగే మూడు రోజుల్లో ఆర్థిక రంగం, వ్యవసాయం, పర్యావరణం, విద్య, వైద్యం తదితర అంశాలపై 37 సమావేశాలు జరుగుతాయని జిల్లా అధికారులు చెప్పారు.