వైసీపీలోకి గ‌ల్లా ఫ్యామిలీ… మ‌హేష్ ఫ్యాన్స్ స్వాగ‌తం…!

-

ఏపీలో విప‌క్ష తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ? కూడా ఎవ్వ‌రికి అర్థం కావ‌డం లేదు. పార్టీలో ఎప్పుడు ఎవ‌రు ఉంటారో ? ఎవ‌రు బ‌య‌ట‌కు వెళ‌తారో ? ఎవ‌రిని న‌మ్మాలో ? ఎవ‌రిని న‌మ్మ‌కూడ‌దో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. త్వ‌ర‌లోనే రాష్ట్ర పార్టీ కార్య‌వ‌ర్గం ఏర్పాటు కానున్న స‌మ‌యంలో పొలిటిబ్యూరోలో ఉన్న మాజీ మంత్రి గ‌ల్లా అరుణ పార్టీని వీడ‌డం పార్టీ వ‌ర్గాల్లో తీవ్ర క‌ల‌క‌లం రేపుతోంది. గల్లా అరుణ కుటుంబానికి చంద్ర‌బాబు ఎంతో ప్ర‌యార్టీ ఇచ్చారు. గల్లా అరుణ‌తో పాటు ఆమె కుమారుడు, గుంటూరు ఎంపీ గల్లా జ‌యదేవ్ ఇద్ద‌రు పార్టీలో పొలిట్‌బ్యూరోలో ఉన్నారు.

పార్టీలో పొలిట్ బ్యూరోలో ఉన్నా కూడా పేరుకు మాత్ర‌మే ప‌ద‌వి కాని ఎలాంటి ప్ర‌యార్టీ ఉండ‌డం లేద‌న్న అస‌హ‌నంతోనే గ‌ల్లా ఫ్యామిలీ పార్టీని వీడాల‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చినట్టు తెలుస్తోంది. గ‌ల్లా ఫ్యామిలీకి భారీగా వ్యాపారాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలోనే వ్యాపార వ్య‌వ‌హారాలు, అవ‌స‌రాల నేప‌థ్యంలో గ‌ల్లా ఫ్యామిలీ బీజేపీలోకి వెళుతుంద‌ని నిన్న మొన్న‌టి వ‌ర‌కు ప్ర‌చారం జ‌రిగింది. ఇక కొద్ది రోజుల క్రితం వ‌ర‌కు అధికార వైఎస్సార్‌సీపీ గ‌ల్లా కుటుంబాన్ని టార్గెట్ చేసింది.

గ‌ల్లా కుటుంబానికి చెందిన అమ‌ర్‌రాజా కంపెనీకి గ‌త ప్ర‌భుత్వం ఇచ్చిన భూములు ర‌ద్దు చేస్తూ వైసీపీ ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. దీంతో కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవాల్సిన ప‌రిస్థితి ఆ కుటుంబానికి వ‌చ్చింది. ఇక టీడీపీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో కూడా లైఫ్ లేద‌ని.. మునిగిపోయే పార్టీలో ఉండి వేలాడ‌డం కంటే వైసీపీలోకి వెళ్ల‌డ‌మే బెట‌ర్ అని గల్లా కుటుంబానికి ఉన్న‌త స్థాయి ఒత్తిళ్లు వ‌స్తున్నాయ‌ట‌. పైగా చిత్తూరు జిల్లాలో ఒక‌ప్పుడు ఓ వెలుగు వెలిగిన ఈ కుటుంబం నేడు రాజ‌కీయంగా కునారిల్లుతోంది.

గ‌ల్లా అనుచ‌ర‌గ‌ణం అంతా త‌లోదిక్కుకు వెళ్లిపోతున్నారు. త‌మ గ‌డ్డ మీద రాజ‌కీయంగా తిరిగి నిల‌దొక్కుకోవాల‌న్నా వ్యాపారాల ప‌రంగా ఇబ్బంది లేకుండా ఉండాల‌న్నా వైసీపీలోకి వెళ్ల‌డ‌మే బెట‌ర్ అన్న ఆలోచ‌న కూడా గ‌ల్లా ఫ్యామిలీ చేస్తోందంటున్నారు. ఇక గ‌ల్లా బావ‌మ‌రిది అయిన సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు అభిమానులు కూడా ఎక్కువ మంది గ‌ల్లా కుటుంబం వైసీపీలో ఉండాల‌నే కోరుతున్నారు. ఇప్పుడు తాజా ప్ర‌చారంతో వారంతా సోష‌ల్ మీడియాలో గ‌ల్లా ఫ్యామిలీ వైసీపీలోకి రావాల‌ని కామెంట్ల‌తో స్వాగ‌తం ప‌లుకుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news