టీడీపీ ఎంపీ గల్లా సీన్ రివ‌ర్స్ అయ్యిందే… అంతా ఢ‌మాల్‌…!

-

గుంటూరు ఎంపీ, ఘ‌ట్ట‌మ‌నేని కృష్ణ అల్లుడు.. గ‌ల్లా జ‌య‌దేవ్‌.. రేటింగ్ ఢ‌మాల్ మంద‌ని టీడీపీ వ‌ర్గాలే గుస‌గుస‌లాడుతున్నాయి. త‌న మాతృమూర్తి గ‌ల్లా అరుణకుమారి రాజ‌కీయాల‌ను ఒంట‌బ‌ట్టించుకున్న జ‌య‌దేవ్‌.. టీడీపీ త‌ర‌ఫున 2014లో గుంటూరు ఎంపీగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ స‌మ‌యంలో ఆయ‌న టీడీపీలో ఓ వెలుగు వెలిగారు. మిస్ట‌ర్ ప్రైమ్ మినిస్ట‌ర్ అంటూ.. పార్ల‌మెంటులో ఆయన చేసిన ప్ర‌సంగం ఇప్ప‌టికీ ఓరికార్డే. ఇక‌, విభ‌జ‌న హామీల్లో భాగ‌మైన ప్ర‌త్యేక హోదాపై చంద్ర‌బాబు ఎటు స్టాండ్ తీసుకుంటే అటు స‌పోర్టు చేస్తూ.. గ‌ల్లా ఢిల్లీ గ‌ల్లీల్లో గుర్తింపు సాధించారు. రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలోనూ ఆయ‌న బ‌ల‌మైన గ‌ళం వినిపించారు.

గ‌త ఏడాది .. జ‌గ‌న్ సునామీ రాష్ట్రాన్ని కుదిపేసినా..గ‌ల్లా గుంటూరులో వ‌రుస విజ‌యం ద‌క్కించుకున్నారు. ఆ త‌ర్వాత ఏడెనిమిది నెల‌ల‌పాటు. ఆయ‌న వ్యూహాత్మ‌కంగా రాజ‌కీయాలు చేసి.. మీడియాలోను, అక్క‌డి ప్ర‌జ‌ల్లోనూ గుర్తింపు పొందారు. రాజ‌ధాని త‌ర‌లింపుపై త‌న‌దైన శైలికి భిన్నంగా(అంటే ప‌క్కా మాస్ రాజ‌కీయాలు) ఆయ‌న రాత్రి వేళ‌లో మారు వేషాలు వేసుకుని మ‌రీ అసెంబ్లీ ముట్ట‌డిని విజ‌య‌వంతం చేసేందుకు ప్ర‌య‌త్నించారు. ఈ క్ర‌మంలోనే అరెస్ట‌యి.. జైలుకు కూడా వెళ్లారు. రాజ‌ధాని ఉద్య‌మానికి నిధులు కూడా ఇచ్చారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉంది.

కానీ, ఆరు మాసాలుగా ఆయ‌న అడ్ర‌స్ ఎక్క‌డా క‌నిపించ‌లేదు. గ‌తంలో ఆయ‌న రేటింగ్ తారా జువ్వ‌మాదిరిగా గుంటూరులో దూకుడుగా ఉంటే.. ఇప్పుడుమాత్రం ఢ‌మాల్‌న కింద‌కు ప‌డిపోయింద‌ని టీడీపీలోనే ప్ర‌చారం జ‌రుగుతోంది. చంద్ర‌బాబు క‌నుస‌న్న‌ల్లోన‌డిచే నాయ‌కుడిగా గుర్తింపు తెచ్చుకున్న గ‌ల్లా.. ఈ ఏడాది జ‌న‌వ‌రి త‌ర్వాత రెండు సార్ల‌కు మించి నియోజ‌క‌వ‌ర్గంలో క‌నిపించ‌లేదు. పైగా రాజ‌ధాని ఉద్య‌మం సాగుతున్నా.. ఆయ‌న అక్క‌డ‌కు క‌నీసం కంటి చూపు కోసం కూడా వెళ్లలేదు. ఇక‌, ఇప్పుడు రాజ‌ధాని విష‌యం పీక్ స్టేజ్‌కు వ‌చ్చిన త‌ర్వాత ఇక్క‌డి ప్ర‌జ‌లు త‌మ‌కు టీడీపీనే దిక్క‌ని న‌మ్ముకుంటే.. ఎవ‌రూ రావ‌డం లేద‌ని, చంద్ర‌బాబు సైతం చేతులు ఎత్తేశార‌ని విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నా.. గ‌ల్లా మాత్రం మౌనంగా ఉంటున్నారు.

కొస‌మెరుపు ఏంటంటే.. కేంద్రానికి ఆయ‌న ఇటీవ‌ల ఓ లేఖ రాశారు. దీంతో ఈ విష‌యం వెలుగు చూడ‌గానే రాజ‌ధాని ప్ర‌జ‌లు సంతోషంగా గంతులు వేశారు. ఇంకేముంది.. రాజ‌ధానిని మార్చొద్దంటూ. గ‌ల్లా అడ్డుచ‌క్రం వేస్తున్నార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆ లేఖ‌లో సారాంశం రెండు రోజుల త‌ర్వాత వెల్ల‌డైంది. అదేంటంటే.. రాష్ట్రానికి ఈ నెల ఎరువుల కోటా పెంచండి.. మా రైతులు ఇబ్బందుల్లో ఉన్నారు. అని గ‌ల్లా త‌న లేఖ‌లో పేర్కొన్నార‌ట‌. ఈ విష‌యం వెలుగు చూశాక‌.. టీడీపీ నాయ‌కులే న‌వ్వుకున్నార‌ట‌. ఇదీ సంగ‌తి..!!

Read more RELATED
Recommended to you

Latest news