టీడీపీకి వరుస షాకుల పరంపరలో మరో బిగ్ షాక్ తగలనుందా ? ఆ పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు బయటకు వెళ్లిపోతే ఇప్పుడు ఏకంగా ఓ ఎంపీ సైతం బయటకు వచ్చేస్తున్నారా ? ఆ ఎంపీ పార్టీ మారేందుకు.. బాబుకు షాక్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నారా ? అంటే అమరావతి సర్కిల్స్‌లో అవునన్న చర్చలే నడుస్తున్నాయి. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి లోక్‌సభకు కేవలం ముగ్గురు ఎంపీలు మాత్రమే ఎన్నికయ్యారు. వీరిలో గుంటూరు నుంచి గల్లా జయదేవ్, విజయవాడ నుంచి కేశినేని నానితో పాటు శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు గెలిచారు. వీరు ముగ్గురూ వరుసగా రెండోసారి లోక్‌సభకు ఎంపికయ్యారు.
ఇదిలా ఉంటే నిన్న మొన్నటి వరకు అమరావతి ఉద్యమంలో కీలకంగా ఉన్న గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ కొద్ది రోజులుగా పూర్తిగా సైలెంట్ అయిపోయారు. అమరావతి కోసం పోరాటం చేసిన గల్లా జైలుకు కూడా వెళ్లారు. ఇక ఇటీవల చంద్రబాబు అమరావతినే రాజధానిగా ఉంచాలంటూ రాజీనామాల ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు ముందు పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలందరితోనూ రాజీనామాలు చేయించాలని ప్లాన్ చేశారు. అయితే బాబు ప్లాన్‌కు చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా ఒప్పుకోలేదు.
కేశినేని నాని లాంటి వాళ్లు చంద్రబాబుకే ఎదురు తిరగడంతో పాటు ముందుగా లోకేష్‌ను మండలికి రాజీనామా చేయమని చెప్పండని అన్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు జయదేవ్ సైతం టీడీపీకి గాయబ్ చెప్పేందుకు రెడీ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. మొన్న ఎన్నికల్లో తన నియోజకవర్గంలో కేవలం ఒకే ఒక ఎమ్మెల్యేగా గెలిచినా క్రాస్ ఓటింగ్‌తో జయదేవ్ గట్టెక్కారు. ఇటీవల జయదేవ్‌కు ఇచ్చిన భూముల విషయంలో రచ్చ కోర్టు వరకు వెళ్లింది. ఆ తర్వాత ఆయనకు చంద్రబాబు, లోకేష్‌పై నమ్మకం పోయినట్టు చెపుతున్నారు.
ఇక గల్లాకు ఉన్న వ్యాపార సంబంధాల నేపథ్యంలో ఆయన బీజేపీ వైపు టర్న్ అవుతున్నట్టు టాక్..? గల్లా ఇప్పుడు టీడీపీలో ఉంటే ఆయన బిజినెస్‌లన్ని ఇబ్బందుల్లో పడడం ఖాయమే అంటున్నారు. గల్లాకు స్తానికంగా వైసీపీ నుంచి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆయన బీజేపీలోకి వెళ్లాలని గల్లా సహచరులు సూచించారని సమాచారం. అందుకే గల్లా జయదేవ్ త్వరలోనే బీజేపీలోకి జంప్ అని అమరావతిలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.